నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతల్ని జగన్ పార్టీ నుంచి గెంటేస్తున్నారు. పొన్నూరు నుంచి రావి వెంకటరమణ, పామర్రు నుంచి డీవై దాస్‌లను కనీసం వివరణ అడగకుండా బయటకు పంపేశారు. ఇప్పుడు అలాగే.. పార్టీలో అసమ్మతి రేపుతున్న తన ప్రత్యర్థుల్ని బహిష్కరించాలని సీఎం జగన్‌ను రోజా కోరుతున్నారు. తన భర్తతో కలిసి వచ్చి మరీ జగన్‌తో సమావేశమైన రోజా.. నగరిలో పరిణామాల్ని వివరించారు.
నగరిలో రోజాకు ఎవరితోనూ సరి పడదు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో వైసీపీ ముఖ్యనేతలు ఆమెకు దూరమే. నగరి మున్సిపల్ చైర్మన్ సహా ఎవరితోనూ మాటలుండవు. అదే సమయంలో ఆ నేతలందరూ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంత్రిగా రోజా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటారు. కానీ నగరిలో వారు పనులు చక్క బెట్టేస్తున్నారు.. ఇటీవల ఓ ఆర్బీకే భవనానికి రోజా లేకుండానే శంకుస్థాపన చేసేశారు. దీంతో రోజా.. ఆవేదనతో .. ఈ రాజకీయాలు అవసరమా అని ఓ ఆడియో లీక్ చేశారు. జగన్ కు చేరేలా చేసుకుని… వెళ్లి కలిశారు.
ఆమె ప్రత్యర్థుల్ని రావి వెంకటరమణ, డీ వై దాస్లులా ఎలిమినేట్ చేయాలని కోరుతున్నారు. కానీ వారంతా పెద్ది రెడ్డి అనుచరులు. రోజాకు ఎర్త్ పెట్టేందుకు పెద్దిరెడ్డే వారిని ప్రోత్సహిస్తున్నారు. జగన్ వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. అసలు సర్వే పేరు చూపించి వచ్చే ఎన్నికల్లో రోజాకే టిక్కెట్ ఇవ్వరన్న చర్చ జరుగుతోంది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డికి టిక్కెట్ ఇస్తారని ఇప్పటికే వైసీపీలో చర్చ ప్రారంభమయింది.