రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకపోయినా వర్ల రామయ్యను నిలబెడుతున్న టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేలపై మైండ్ గేమ్ ప్రారంభించింది. రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆలోచించాలంటూ.. ప్రకటనలు చేస్తోంది. ఓడిపోతారని తెలిసి వర్ల రామయ్యను నిలబెట్టడం… దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని… మంత్రి ఆదిమూలపు సురేష్… చేసిన ప్రకటనను టీడీపీ అనుకూలంగా మార్చుకుంటోంది. సురేష్‌కు.. వర్ల రామయ్య వెంటనే కౌంటర్ ఇచ్చారు. మనసు పెట్టి ఆలోచిస్తే.. నీ ఓటు కూడా నాకే పడుతుందని.. ఆలోచించమని సూచించారు. వర్ల రామయ్య ఉద్దేశం ప్రకారం.. ఎస్సీ ఎమ్మెల్యేలంతా తనకు ఓటు వేస్తే.. ఎందుకు ఓడిపోతానని కావొచ్చంటున్నారు. టీడీపీ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేయాలనుకుంటోంది.
వైసీపీ తరపున ఇప్పటికి రాజ్యసభకు ఆరుగురు వెళ్లే అవకాశం దక్కింది. ఇందులో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం నేతలే. ఒకరు మత్స్యాకార, మరొకరు శెట్టిబలిజలకు ఇచ్చారు. మరో స్థానాన్ని గుజరాత్‌కు కేటాయించారు. పెద్ద పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు అసలు చాన్స్ కేటాయించడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ వర్గాలు అండగా నిలబడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కుతున్న తరుణంలో ఒకటికి కూడా ఎస్సీలకు ఇవ్వకపోవడటానికి గల కారణాలేమిటని పరోక్షంగా ప్రజల్లోకి సంకేతాలు పంపించడంతోపాటు ఇదే అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లే విధంగా పార్టీ యంత్రాంగాన్ని అధినేత చంద్రబాబు సమాయత్తం చేస్తున్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా తగ్గిపోయింది. దీనిపై వైసీపీ సుప్రీంకోర్టుకెళ్లకుండా బీసీలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఈ దశలోనే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని సీఎం జగన్ బీసీలకు ఇచ్చారు. అప్పట్లో వర్ల రామయ్యకు ఇవ్వలేదనే ఉద్దేశంతో తమపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు రాజ్యసభ నాలుగు స్థానాల్లో ఒక్కరికీ కూడా ఇవ్వకుండా ఎస్సీలను నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వర్ల రామయ్య కూడా బరిలో నిలబడేందుకు అంగీకరించారు.