బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నిక వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఉపఎన్నిక వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. కానీ అధికారంలో కాంగ్రెస్ ఉంది. దీంతో గెలవడం కష్టమనుకున్నారు. కానీ బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఓటర్లను క్యాంపులకు తరలించి నేరుగా ఓటింగ్ కు తీసుకు వచ్చింది. చివరికి బీఆర్ఎస్ అనుకున్న్ ఫలితాన్ని సాధించింది.
ఇదే స్ఫూర్తిగా జగన్ కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లో గెలవాలని అనుకుంటున్నారు. అప్పట్లో స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఇప్పుడు అతి తక్కువ ఓటర్లు ఉన్నారు. కానీ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అందుకే జగన్ సీనియర్ అయిన బొత్సను అభ్యర్థిగా ప్రకటించి.. తానే ఓటర్లతో మాట్లాడటం ప్రారంభించారు. రెండు రోజుల పాటు విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు అందర్నీ క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జగన్ తో సమావేశం తర్వాత వారిని క్యాంపులకు తరలించే అవకాశం ఉంది.
అయితే ఎంత మంది జగన్ క్యాంప్ ఆఫీసుకు వస్తారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చాలా మంది టీడీపీ, జనసేనల్లో చేరారు. విశాఖ కార్పొరేటర్లు చాలా మంది పార్టీ మారిపోతున్నారు. టీడీపీ కూడా పార్టీలో చేరిన వారితో క్యాంపు ఏర్పాటు చేస్తోంది. ఓడిపోయే అవకాశం ఉందని ముందుగానే కారణాలు వెదుక్కుంటున్నారు వైసీపీ నేతలు. ఓటర్లను కొంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా జగన్ బాధ్యత తీసుకుని ముందుగానే ఇలాంటి కారణాలు చెబితే చేతకాని తనమనుకుంటారు. కానీ అదే చేస్తున్నారు