ఎవరైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్యే అవుతారని తెలుసు ఓడితే ఎంపీ ఎలా అవుతారు? అవుతానంటున్నాడు ఓ అభ్యర్థి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో సంపన్నుడైనా రమేష్ శర్మ మూడో విడతలో పోలింగ్ జరిగే బిక్రం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇది పాట్నా నగరంలో ఉంది.
తన సంపద విలువు 928 కోట్ల రూపాయలని రమేశ్ శర్మ తన ఎన్నికల అఫిడవిట్ లో స్వయంగా తెలిపాడు. తనను గెలిపించాలంటూ ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నాడు. తాను ఇప్పటికే వందల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యేను అవుతానని, ఓడితే ఎంపీనవుతానని కూడా చెప్తున్నాడు.
అపర కుబేరుడైన ఇతగాడు ఎన్నికల్లో ఓడితే బాధ పడడట. తనకున్న డబ్బుతో రాజ్యసభ సీటు కొనుక్కుంటాడట. అంటే ఏదో ఒక పార్టీకి ఫండ్ పేరుతో కోట్ల సొమ్ము ముట్టజెప్పి రాజ్యసభ సభ్యుడిని అవుతానని డంకా బజాయించి చెప్తున్నాడు. షిప్పింగ్, ఇంజినీరింగ్ పరికరాలు, సినిమా వ్యాపారాల్లో ఇతగాడు బాగానే సంపాదిస్తున్నాడు. ఈయన ప్రచారానికి వస్తున్నాడనగానే ఆ ఏరియా వారికి వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే పెద్ద కాన్వాయ్ తో వెళ్తాడు. అందులో మామూలు కార్లుండవు. బెంజ్, బి ఎం డబ్ల్యు వంటి లగ్జరీ కార్ల కాన్వాయ్ తో ప్రచార యాత్ర చేస్తుంటాడు. ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాడు. ఇంతకీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడో, ఓడి ఎంపీ అవుతాడో చూద్దాం.