సంక్రాంతి తరవాత కాస్త స్థబ్దుగా మారింది. సింగం, నమో వేంకటేశాయ లాంటి సినిమాలు వచ్చినా వసూళ్లలో జోరు చూపించలేదు. నాని సినిమా – నేను లోకల్ ఒక్కటే బాక్సాఫీసు దగ్గర హిట్టయ్యింది. ఘాజీ కి సూపర్ టాక్ వచ్చింది గానీ, బాక్సాఫీసు దగ్గర దాని స్టామినా ఎంతో లెక్కగట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా బాక్సాఫీసు దగ్గర మరోసారి కొత్త సినిమాల తాకిడి కనిపించబోతోంది. ఈ వారం విన్నర్, యమన్, లక్ష్మీ బాంబ్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విన్నర్, యమన్‌లపై మంచి అంచనాలే ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న చిత్రం విన్నర్. ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమా టాక్ వింటుంటే.. పక్కా పైసా వసూల్ మూవీనే అనిపిస్తుంది. పైగా సాయిధరమ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మాస్ సినిమా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. సో… సాయిధరమ్‌కు బాక్సాఫీసు దగ్గర అడ్డు లేకపోవొచ్చు.
ఇక యమన్ సంగతికి వస్తే.. బిచ్చగాడు తరవాత విజయ్ ఆంటోనీ క్రేజ్ తెలుగునాట బాగా పెరిగింది. తన సినిమా ఎలా ఉంటుందో చూద్దామన్న ఉత్సుకత కలుగుతోంది. అది యమన్‌కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ప్రస్తుతం ఉన్న తమిళనాడు రాజకీయాలకు ఈ కథ అత్యంత దగ్గరగా ఉంటుందట. సో… తమిళంలో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమా వచ్చి చాలా రోజులైంది. బీ, సీల్లో విజయ్ ఆంటోనీ క్రేజ్‌తో టికెట్లు బాగా తెగే అవకాశం ఉంది. మల్టీప్లెక్స్‌లో మాత్రం ఈసినిమాకి వసూళ్లు రావడం అనుమానంగానే ఉంది. దొంగాటతో తొలి కమర్షియల్ హిట్ అందుకొంది మంచు లక్ష్మి. మరోసారి తన సోలో పెర్‌ఫార్మ్సెన్స్‌ని నమ్ముకొని తీసిన సినిమా లక్ష్మీబాంబ్. పలుసార్లు వాయిదా పడి.. ఈనెల 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొంది. ప్రచారం చూస్తుంటే అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. ఈ సినిమా ఆఖరి సమయంలో వాయిదా పడినా పడొచ్చని ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వారమే కేరాఫ్ గోదావరి, ఓటుకు నోటు అనే మరో రెండు చిన్ సినిమాలూ విడుదల తేదీ ప్రకటించాయి. అయితే వాటి పత్తా ఇప్పటి వరకూ లేదు.