కాలాలు మారుతున్నా, మారనిది ఒకటుంది. అదే పార్లమెంట్ సమావేశాలను గౌరవసభ్యులు సాగించే ధోరణి. వానాకాలం, శీతాకాలం… బడ్జెట్ సమావేశాలంటూ ఏటా జరుగుతూనే ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజలసొమ్ము హారతికర్పూరంలా ఖర్చవుతూనేఉంది. కానీ ప్రజలకు ఉపయోగపడే కీలక చర్చలు, బిల్లుల ఆమోదంవంటి సభాకార్యక్రమాలు మాత్రం ఎప్పుడూ నత్త నడకే. చట్టసభల్లో గౌరవసభ్యుల తీరు హుందాతనాన్ని కోల్పోతున్నదని పార్లమెంట్ లోని సీనియర్లే ఆవేదనచెందుతున్నారు. గౌరవసభ్యుల ప్రవర్తన తీరుపై అనేక సందేహాలు వస్తూనేఉన్నాయి.
చట్టసభల్లో షెడ్యూల్డ్ కార్యక్రమాల ఎలా ఉన్నా, సభ్యుల ప్రవర్తన ఆధారంగా ఇలాంటి వార్తలను కొన్నైనా మనం సభ జరిగే రోజుల్లో చూస్తూనేఉంటాము….
1. సభా కార్యక్రమాల ప్రారంభం
2. వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాలంటూ విపక్షాల పట్టు. తిరస్కరించిన స్పీకర్.
3. కొశ్చిన్ అవర్ కు అడ్డు తగలడం.
4. కొన్ని అంశాలపై కీలక చర్చకు పట్టుబట్టడం.
5. స్పీకర్ సభను తాత్కాలికంగా వాయిదావేయడం.
6. మళ్ళీ సభ ప్రారంభం.
7. తిరిగి అవే దృశ్యాలు.
8. సభలో గందరగోళ పరిస్థితి.
9. పోడియామ్ ను చుట్టుముట్టిన గౌరవ సభ్యులు
10. వెల్ లోకి దూసుకెళ్ళిన విపక్ష సభ్యులు
11. సభలో రభస
12. పలుమార్లు సభ వాయిదా
13. విపక్ష సభ్యుల సస్పెన్షన్.
14 గౌరవసభ్యులను సభవెలుపలకు తరలించిన మార్షల్స్
15. సభాప్రాంగణలో విపక్షాల ధర్నా
15. సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ ఆందోళన.
16. విపక్ష సభ్యులు లేకుండానే కీలక బిల్లుల ఆమోదం
17. చర్చ ప్రారంభం
18. పాలకపక్ష నేత, ప్రతిపక్షనేతల సుదీర్ఘ ప్రసంగాలు.
19. సభ నిరవధిక వాయిదా.
20. చట్టసభల్లో వృధాఅవుతున్న కాలం… ప్రజాస్వామిక ప్రియుల ఆవేదన.
ఏ కాలంలో చట్టసభలు ప్రారంభించినా ఇదే తంతుగా మారిందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీన్ని ప్రజాస్వామ్య పోకడ అని సరిపెట్టుకోవాలా ? లేక ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడంగా భావించాలా ?
26 నుంచి శీతాకాల సమావేశాలు
చట్టసభను నిర్వహించడంలో ఒక సాంప్రదాయం, ఆనవాయితీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల (నవంబర్) 26న ప్రారంభించి డిసెంబర్ 23వరకు జరపాలని నిర్ణయించారు. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసీపీఏ) ఇవ్వాళ (నవంబర్ 9) సమావేశమై శీతాకాలసమావేశాల తేదీలను ఖరారుచేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో వస్తు,సేవల పన్ను బిల్లు (జిఎస్ టి బిల్లు) , భూసేకరణ బిల్లు, రియల్ ఎస్టేట్ నియంత్రణ-అభివృద్ధి బిల్లు, నెగోషబుల్ ఇనుస్ట్రుమెంట్స్ ఆర్బిటరేషన్ బిల్లులకు ఆమోదం ముద్రపడేలా చూడాలని పట్టుదలగా ఉంది. క్రిందటి పార్లమెంట్ సమావేశాలు (వానాకాల సమావేశాలు) ఎలాంటి కీలక చర్చలు, బిల్లుల ఆమోదం వంటివి లేకుండానే నిరవధికంగా వాయిదాపడ్డాయి.
`అసహనం’ కాంగ్రెస్ ఆయుధం
దేశంలోని అసహనం పెరిగిపోతున్నదన్న ఆరోపణలపై లోక్ సభలో ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ ఈసారి దుమ్మెత్తిపోయవచ్చు. దీనికితోడు బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే వైఫల్యం సభలో ఎన్డీయే సభ్యులను ఇరకాటంలో పెట్టవచ్చు. మొత్తానికి ఈ శీతాకాల సమావేశాలు కూడా సజావుగా జరుగుతాయన్న గ్యారంటీ కనబడటంలేదు. బిజేపీని ఎన్నిరకాలుగా ఇబ్బందికి గురిచేయవచ్చో అన్ని రకాలుగానూ ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుంది. కాగా బిజెపీ మరో పక్క కీలకమైన సంస్కరణలను తీసుకురావడం కోసం గట్టిగా ప్రయత్నించవచ్చు. క్రిందటి వానాకాల సమావేశాల్లో కాంగ్రెస్ మొదటి నుంచీ సుష్మాస్వరాజ్- లలిత్ మోదీ వీసా వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి అంతే సీరియస్ గా అసహనం పోకడని తీసుకోవచ్చు. ఇప్పటికే ఈవిషయంపై సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుసుకున్నారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. కాగా, శీతాకాలసమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా కాంగ్రెస్ కీలక అభ్యంతరాలు తెలియజేయవచ్చు. మొత్తానికి సభలో ఎక్కువ కాలం వృధా అయ్యే అవకాశాలున్నాయని ప్రజాస్వామ్య ప్రియులు ఆందోళనపడుతున్నారు. మరి ఎలాంటి దృశ్యాలను చూడబోతున్నామో…ఏమో…వేచిచూద్దాం.
– కణ్వస