నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వచ్చే నెల 28వరకు సాగే ఈ సమావేశాలలో 30 బిల్లులపై చర్చించి ఆమోదం పొందవలసి ఉంది. అందుకు ప్రతిపక్షాల సహకారం కోరేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బాలనేరస్థుల శిక్షలను కటినతరం చేయడం కోసం చట్ట సవరణలు, జి.ఎస్.టి., రియల్ ఎస్టేట్, ఎస్సి ఎస్టీ బిల్లు మొదలయిన వాటిపై చర్చించి ఆమోదించవలసి ఉంది. అలాగే కేంద్రప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఆర్డినెన్స్ లపై చర్చించి ఆమోదించవలసి ఉంది. ఈ సమావేశాలలోనే అగ్రికల్చర్ బయో సెక్యురిటీ మరియు న్యూక్లియర్ సేఫ్టీ బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇవికాక వివిధ పద్దుల క్రింద అదనపు నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ సవరణల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపవలసి ఉంది. కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు యధాప్రకారం ఈసారి కూడా పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపజేయడానికి సంసిద్ధం అవుతున్నాయి. ఈ బిల్లులలో అతిముఖ్యమయిన జి.ఎస్.టి.బిల్లుకి తాము వ్యతిరేకం కాదని చెపుతూనే దానికి కొన్ని సవరణలు సూచించి, అవి చేస్తేనే ఆ బిల్లుకి మద్దతు ఇస్తామని వాదిస్తోంది.
గత సమావేశాలలో లలిత్ మోడీ కేసును పట్టుకొని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజీనామాలకు, వ్యాపం కుంభకోణంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామాకు పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేసిన కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఈసారి మత అసహనం అంశాన్ని పట్టుకొని పార్లమెంటుని స్తంభింపజేసేందుకు సిద్దం అవుతున్నాయి. సభా కార్యక్రమాలు సజావుగా జరుగనిస్తే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అన్ని సమస్యలపైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం హామీ ఇస్తోంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఆనందించాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు భావిస్తున్నాయి కనుక ప్రభుత్వానికి సహకరించకపోవచ్చును.