భారతదేశంలో ఓ కార్పొరేట్ కంపెనీకి లాభం ఎంత ఉంటుంది..? అద్భుతంగా లాభాల్లో నడిస్తే రూ. వెయ్యి కోట్ల లాభం వస్తే ఆ పరిశ్రమకు తిరుగులేనిదని ముద్ర వేసేయవచ్చు. కానీ అదే రాజకీయ పార్టీలకు అయితే ఎలాంటి వ్యాపార వ్యవహారాలు లేకపోయినా వేల కోట్ల నిధులు వచ్చి పడతాయి. అధికార పార్టీ అయితే అసలు అంతూ పొంతే ఉండదు. దానికి బీజేపీనే ఉదాహరణ. భారతీయ జనతా పార్టీకి ఒక్క ఏడాదిలో వచ్చిన ఆదాయం… రూ. 5611 కోట్లు. అక్షరాలా ఐదు వేల ఆరు వందల పదకొండుకోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో బీజేపీకి ఆదాయం ఎలా వచ్చిందంటే… ఒకే ఒక్క వనరు… అదే అధికారం. దేశంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాలు ఇవ్వడానికి దేశ ప్రజలందరూ పోటీ పడ్డారు.
ఇక్కడ దేశ ప్రజలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిదంటే… బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు ప్రభుత్వం దగ్గర కూడా ఉండవు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అనే పద్దతిని తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరైనా తమ వివరాలు వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఎంతైనా ఇవ్వొచ్చు. ఇలాంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఒక్క ఏడాదిలో వచ్చిన విరాళాలు రూ. 2555 కోట్లు. దేశంలో మరే రాజకీయ పార్టీకి ఇంత స్థాయిలో ఎవరూ విరాళాలు ఇవ్వలేదు. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అందింది కేవలం రూ. మూడువందల కోట్లకు కొద్దిగా ఎక్కువ మాత్రమే. దేశంలో బ్లాక్ మనీని ఇలా రాజకీయ పార్టీల ఖాతాలో ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా వేస్తున్నారన్న అనుమానాలు.. ఆరోపణలు ఉన్నాయి. గతంలో అయితే రూ. ఇరవై వైలు విరాళం ఇచ్చినా లెక్క చెప్పాల్సి ఉండేది.
కానీ బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ విధానం తేవడంతో .. అధికార పార్టీగా బీజేపీ పంట పండుతోంది. వేల కోట్ల ఆదాయంతో దూసుకెళ్తోంది. అధికార పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు… ఆ పార్టీపై అభిమానంతో ఇవ్వరు. ఇంకేదో ఆశిస్తారు. అలాంటివి ఆశించి.. ప్రభుత్వంలో పనులు చేయించుకోవడానికి విరాళాలిస్తే అది విరాళం కాదు.. లంచం అవుతుంది. కానీ ఇప్పుడు ఇండియాలో అది ఎలక్టోరల్ బాండ్ అవుతుంది. మొత్తంగా ఇతర పార్టీలకు నిధులు వెళ్లడంలో పూర్తిగా కట్టడి చేసి… తమ పార్టీకి మాత్రం కార్పొరేట్ కంపెనీ కన్నా ఎక్కువ పరిపుష్టి కల్పించడంలో బీజేపీ అగ్రనేతలు సఫలమయ్యారు. ఇతర రాజకీయ పార్టీలు.. తమ కార్యాలయాలను కూడా నిర్వహించుకోలేని స్థితికి వెళ్లిపోతున్నాయి.