ఒకప్పుడు సినిమా బడ్జెట్ వంద కోట్లు అంటే.. `అమ్మో` అనేవారు. వంద కోట్లు తెచ్చుకున్న సినిమాలైతే రికార్డులు సృష్టించినట్టే. `వంద కోట్ల సినిమా` అనే పోస్టర్లు, హంగామా మమూలుగా ఉండేది కాదు. హీరోల పారితోషికాల గురించి ఎప్పుడు చర్చకు వచ్చినా – పది కోట్లు, పదిహేను, ఇరవై, పాతిక దగ్గరే మాటర్ నడిచేది. అది కూడా ఎక్కువే అన్నది ఫీలింగ్. కానీ ఇప్పుడు పారితోషికాల విషయంలో పెను మార్పు వచ్చేసింది. తెలుగు హీరోల పారితోషికమే వంద కోట్ల పైమాట. టాలీవుడ్ లో ఇది కనీ వినీ ఎరుగని మార్పు.
ప్రభాస్ పారితోషికం రూ.125 నుంచి రూ.150 కోట్ల వరకూ చేరిపోయింది. `పుష్ప`తో బన్నీ తన పారితోషికాన్ని వంద కోట్లకు తీసుకెళ్లాడని టాక్. ఇది ఓ తెలుగు హీరో కలలో కూడా ఊహించని పారితోషికం. బన్నీ, ప్రభాస్లకే ఎందుకింద? అంటే.. బాలీవుడ్లో వీళ్లు హిట్లు కొట్టారు. నార్త్ తో తఢాకా చూపించారు. అదీ.. లెక్క. ప్రభాస్, బన్నీ ఇద్దరూ ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. కేవలం తెలుగు సినిమాల్ని డబ్బింగ్ రూపంలో హిందీలో రిలీజ్ చేశారు. అక్కడ వందల కోట్లు వసూలు చేయడంతో….. ఈ ఇద్దరు హీరోలూ వంద కోట్ల హీరోలు అయిపోయారు. అంటే.. బాలీవుడ్ లో హిట్టు కొడితే, అది డబ్బింగ్ సినిమా అయినా సరే, వంద కోట్ల సూట్ కేసు అందుకోవడానికి అర్హత సంపాదించినట్టే అన్నమాట.
అందుకే ఇప్పుడు హీరోలంతా బాలీవుడ్ పై కన్నేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాభవం తెలుసుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ బాలీవుడ్ అంటే అస్సలేమాత్రం పట్టించుకోని మహేష్ ఇప్పుడు పాన్ ఇండియా కథల కోసం అన్వేషిస్తున్నాడు. రవితేజ ఖిలాడీ హిందీలో భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసే సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనివే. విజయ్‌దేవరకొండ `లైగర్`తో బాలీవుడ్ గడప తొక్కుతున్నాడు. నాని దృష్టి కూడా ప్రస్తుతం అటువైపే ఉంది.
తెలుగులో సూపర్ డూపర్ హిట్లు కొట్టి, ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన మహేష్, పవన్ ల పారితోషికాలు రూ.50 కోట్లే. పవన్ ఇప్పుడు రూ.60 వరకూ తీసుకుంటున్నాడు. నిన్నా మొన్నటి వరకూ వీళ్లకు చాలా దూరంగా ఉన్న ప్రభాస్, అల్లు అర్జున్‌లు ఒకే ఒక్క బాలీవుడ్ హిట్ వంద కోట్లకు జంప్ చేశారు. అదే.. మిగిలిన హీరోల్లో స్ఫూర్తి నింపుతోంది.