కర్ణాటక ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో భాజపా ఉందోలేదో తెలీదు! ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిన్న మాట్లాడిన మాటలు చూస్తే… ఈ ఎపిసోడ్ పై ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితే ఆ పార్టీలో కనిపించడం లేదు. అంతేకాదు, కనీస మర్యాద పాటిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామనీ, తమ లోపాలను సరిచేసుకుంటామని కూడా అమిత్ షా చెప్పలేదు. ఇది కాంగ్రెస్, జేడీఎస్ ల గెలుపే కాదన్నట్టుగా భాజపా చూస్తోంది. కర్ణాటకలో తమకు అత్యధిక స్థానాలు వచ్చినా, గతం కంటే భాజపా మెరుగైందని చెప్పుకుంటున్నా… ఆ పార్టీ వ్యవహార శైలి వల్ల జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను భాజపా విశ్లేషించకుంటున్నట్టుగా లేదు.
కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ముఖ్యమంత్రిగా కుమార స్వామి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నేతలు తరలి వస్తున్నారు. ఒక్కసారి ఆహ్వానితుల జాబితా చూస్తూ…ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాయావతి, మమతా బెనర్జీ, పినరయి విజయన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, చంద్రబాబు నాయుడు, అజిత్ సింగ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కమల్ హాసన్, ఎమ్.కె. స్టాలిన్ వంటి ప్రముఖులున్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్లే బెంగళూరు వెళ్లి, కాబోయే సీఎంకి శుభాకాంక్షలు తెలిపి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కీలకమైన రాజకీయ నేతలు వీరంతా. ఒకే వేదిక మీదకు వస్తున్నారు. అంటే, రాజకీయంగా ఈ కలయికను ఒక కూటమిగా ఇప్పుడు చూడటం సరికాదు! కానీ, ఆ దిశగా అడుగులు పడేందుకు, ఆలోచనా ధోరణి మారేందుకు అవకాశం కల్పిస్తున్న పునాదిగా ఈ కలయిక నిలిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఈ పార్టీలూ, ఈ నాయకుల మధ్య ఏకాభిప్రాయానికీ… అనూహ్య ఐక్యతకూ ఆస్కారం కల్పిస్తున్న ఒకే ఒక్క అంశం… భారతీయ జనతా పార్టీ అధికారం! కేవలం అదొక్కటే వీరందరినీ ఒక వేదిక దగ్గరకు కలుసుకునేలా చేసిందని చెప్పొచ్చు. భాజపా ఒంటెత్తు పోకడలను ఎదుర్కొనాలంటే… అందరూ కలిసి తీరాలన్న ఒక రకమైన పట్టుదల ఇప్పుడు దేశంలో ఇతర పార్టీల్లో మొదలైందనడానికి ఇదే ఉదాహరణగా నిలుస్తుందనీ చెప్పొచ్చు. నిజానికి, ఉత్తరప్రదేశ్ లో ఆ మధ్య జరిగిన రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలే భాజపాకి వ్యతిరేకంగా అసాధారణ పార్టీల కలయికలకు నాంది పలికాయని చెప్పొచ్చు. మొత్తానికి, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు ఏర్పాటు కార్యక్రమం… భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేసే కొత్త సమీకరణాలకు ప్రారంభంగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.