జాతకాలు తిరగబడ్డానికి బళ్లు ఓడలు.. ఓడలు బళ్లూ కావడానికి ఒక్క సినిమా చాలు! టాప్ ఫామ్‌లో ఉన్నోడు అథఃపాతాళానికి కూరుకుపోవడానికీ, పాతాళంలో ఉన్నవాడు ఎవరెస్ట్ ఎక్కడానికీ… ఒకటే సినిమా తేడా. స్వామి రారాకు ముందు నిఖిల్ పై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. ఆ సినిమాపై ఎవ్వరూ దృష్టి పెట్టలేదు. అలాంటిది క్రైమ్ కామెడీ జోనర్లో వచ్చిన స్వామి రారా అందరి మనసుల్నీ గెలుచుకొంది. నిఖిల్ టాప్ పామ్‌లోకి వచ్చేశాడు. కార్తికేయ కూడా హిట్టే. ఇంకేముంది నిఖిల్ చుట్టూ నిర్మాతలు ఈగల్లా ముసిరారు. సూర్య వర్సెస్ సూర్య కూడా నిలబడిపోవడంతో నిఖిల్ ఒక్కసారిగా హ్యాట్రిక్ హీరో అయిపోయాడు.
వచ్చిన ప్రతీ ఆఫర్‌నీ ఒప్పుకోకుండా.. జాగ్రత్తగా ఆచి తూచి అడుగువేస్తున్న సమయంలో శంకరాభరణం అనే అగాథంలో పడ్డాడు నిఖిల్. ఆ సినిమా అట్టర్‌ఫ్లాప్ అవ్వడమే కాదు.. నిఖిల్‌ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. శంకరాభరణం తరవాత నిఖిల్ సినిమాఏదీ పట్టాలెక్కలేదు.
ఓ కథ రెడీగా ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలవ్వడం లేదు. ఈలోగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథని లాక్ చేశాడు నిఖిల్. కథ బాగుంది, దర్శకుడు దొరికాడు… కానీ నిర్మాతే దొరకడం లేదట. శంకరాభరణం సినిమా ముందు నిఖిల్ తో సినిమా చేద్దామని తెగ ఉబలాటపడిన నిర్మాతలు ఇప్పుడు నిఖిల్ కంటి కనిపించకుండా, ఫోన్‌కి అందకుండా తిరుగుతున్నారట. ఒక్క సినిమాకే మరీ ఇంత ఎఫెక్టా?? అంటూ.. నితిన్ కూడా షాకైపోతున్నాడు. మరి నిఖిల్ కి నిర్మాత ఎప్పుడు దొరుకుతాడో మరి.