తెలంగాణ ఆర్టీసీలోకి ప్రైవేటు బస్సుల్ని ప్రవేశపెట్టడానికి కేసీఆర్ సర్కారు సిద్ధమైపోయిన సంగతి తెలిసిందే. కేబినెట్ కూడా నిర్ణయం తీసేసుకుంది. 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చేందుకు అంతా రెడీ! అయితే, అన్ని బస్సుల్నీ ఒకేసారి రోడ్డు మీదికి తెచ్చే అంశమై ప్రభుత్వం దగ్గర స్పష్టత కొరవడినట్టు సమాచారం! సర్కారు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఒకేసారి అన్ని బస్సుల్నీ రోడ్లమీదికి దించడం అంత ఈజీగా కాదని కొంతమంది ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి అన్నింటినీ రోడ్ల మీదికి తెస్తే… పరిస్థితి ఎలా ఉంటుందో అనే అంచనా ప్రభుత్వం దగ్గర లేదట! కాబట్టి, దశలవారీగా ప్రవేశపెడదామనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. తొలిదశలో సుమారు 1200 బస్సులకు మాత్రమే నోటిఫికేషన్!
ప్రైవేటు బస్సుల పనితీరు మీద అధికార పార్టీకి చెందిన నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమలు చేసే ముందు రాజకీయపరంగా విమర్శలు ఎదురు కాకుండా చూసుకోవాలి కదా అనేది కొందరి మాట! ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా సమ్మె చేస్తున్నా, ప్రజలు ప్రయాణాలకు ఇబ్బంది పడుతూ ఉన్నా… ఇవన్నీ కాదని, ఇంతకంటే ఇంకా ఏదో మెరుగైన రవాణా వ్యవస్థను తెచ్చేస్తామన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు ఉంటున్న సంగతి తెలిసిందే. వాటికి అనుగుణంగా ప్రైవేటు బస్సుల పనితీరు లేకపోతే… పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవడం ఖాయం. కాబట్టి, కొన్ని బస్సుల్ని ఓ రెండు లేదా మూడు నెలలపాటు కొన్ని రూట్లలో తిరగనిచ్చి, వాటి పనితీరును గమనించాక… మిగతావాటిని దింపడం సరైందనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు చెబుతున్నారు. ఇంతవరకూ ప్రైవేటు బస్సులు కేవలం కాంట్రాక్టు కేరియర్లుగా మాత్రమే తిరుగుతున్నాయి, స్టేజ్ కేరియర్లుగా ప్రైవేటు బస్సుల్ని తిప్పడం ఇదే ప్రథమం అవుతుంది.
ప్రజా రవాణా అంశంలో కేసీఆర్ సర్కారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో వేరే చెప్పాల్సిన పనిలేదు! ఆర్టీసీ కార్మికులు చేస్తు్న సమ్మె… ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యగా మాత్రమే ప్రభుత్వం డీల్ చేస్తోంది. కోట్లమంది ప్రజల సౌకర్యం మీద శ్రద్ధే కనిపించడం లేదు! ప్రైవేటీకరణే అంతిమ లక్ష్యం అనుకున్నప్పుడు… ముందుగా ఆ ప్రైవేటీకరణ ఎలాగో ఏంటో అధ్యయనం ఉండాలి. ఆ అధ్యయనానికి సమయం లేదనుకున్నప్పుడు… తాత్కాలికంగా ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే ప్రయత్నం చేసి, ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలి. దశలవారీ ప్రైవేటీకరణ అప్పుడే చెయ్యాలి. ఈ రెండు కేసీఆర్ సర్కారు చేయడం లేదు. ఆర్టీసీని కాదని రోడ్ల మీదకి తెచ్చే ప్రైవేటు వాహనాలు ఎలాంటి సౌకర్యాలు ఇస్తాయో ప్రభుత్వానికే అంచనా లేని పరిస్థితి ఉందంటే ఏమనుకోవాలి.