తెలంగాణ రైతులకు యాసంగి రైతు బంధు పథకాన్ని బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ ప్రారంభించనున్నారు. రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. తెలంగాణ రైతులకు పంట సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి రూ. 7500 కోట్ల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులు సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీగా ఉన్నా, రైతు బంధు నిధుల విడుదలపై అధికారులకు క్లారిటీ ఇచ్చారు. మొదటగా ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో నేడు రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేలు జమ అవుతాయి. రేపు రెండు ఎకరాలు ఉన్న వారికి, 17వ తేదీన మూడు ఎకరాలు, ఆ తరువాత ఒక్కోరోజు 5, 10, 15, 20 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్నవారికి నిధులు జమ చేస్తారు.
గత ఏడాది కూడా ఇలాగే విడుదల చేశారు. ఈ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రచారం మాత్రం ప్రభుత్వం ఎక్కువగా చేసుకోవడం లేదు. కనీసం ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇవ్వడం లేదు. మీట నొక్కడాలులాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోలేదు. రైతు బంధు పథకం..ఎలాంటి కేంద్ర పథకంతోనూ కలపలేదు. పూర్తిగా రాష్ట్రమే అమలు చేస్తోంది.