మహిళలపై అఘాయిత్యాలు జరిగిన ప్రతీ సారి ఏపీ సర్కార్ దిశ చట్టం గురించి ప్రచారం చేస్తూంటుంది. దిశ యాప్ అంటుంది. దిశ శిక్షలు అంటుంది.అందరూ దిశను గుర్తు పెట్టుకోవాలని చెబుతూ ఉంటుంది. ఇవాళ కూడా ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేశారు. దిశ యాప్ను ఇంటింటికెళ్లి అందరి ఫోన్లలోనూ ఇన్స్టాల్ చేయిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రచార కార్యక్రమం కోసం రూ. కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో అమ్మాయిలు.. మహిళలపై జరుగుతున్న దాడులకు పరిష్కారం దిశ యాప్ అన్నట్లుగానే చెబుతున్నారు. కానీ ఒక్కయాప్తో సమస్య పరిష్కారం కాదు. కావాల్సింది చిత్తశుద్ధి.
హడావుడే కానీ నిందితుల్ని పట్టుకోరేందుకు..!?
సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుల్ని ఇంత వరకూ పట్టుకోలేకపోయారు. వారం రోజుల నుంచి విచారణ జరుపుతున్నారు. కనీస కనికరం లేకుండా బాధితురాల్నే పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి ప్రశ్నించారు కూడా. అయిన నిందితుల్ని గుర్తించలేకపోయారు. అదే.. వైసీపీ నేతల మీద ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెట్టినట్లుగా ఫిర్యాదులు వస్తే.. పోలీసుల్లో ఎక్కడా లేని చురుకుదనం వస్తుంది. అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా వెళ్లి అరెస్ట్ చేసుకొస్తారు. కానీ.. మహిళలపై దాడుల కేసుల్లో పోలీసులు ఆ చురుకుదనం చూపించడం లేదు. ఒక్క మహిళలపై దాడులనే కాదు.. ఇతర లా అండ్ ఆర్డర్ కేసుల్లో పోలీసుల వైఫల్యాలు తరచూ బయటపడుతున్నాయి. రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షనిజం ఊపిరి పోసుకుంటూండటమే దీనికి సాక్ష్యం.
దిశ – అభయం యాప్లు ఇప్పటి వరకూ ఎందుకు ఉపయోగపడటం లేదు..?
మహిళల భద్రతకు ప్రభుత్వం ఇప్పటివరకూ చాలా చర్యలు ఘనంగా ప్రకటించింది. పబ్లిసిటీ చేసుకుంది. కానీ ఆచరణలో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే… ప్రభుత్వం తర్వాత పట్టించుకోకపోవడమే. దిశ చట్టం ఇంత వరకూ కేంద్రం ఆమోదం పొందలేదు. కానీ దిశ పేరుతో పోలీస్టేషన్లు పెట్టారు. యాప్ తెచ్చి మీట నొక్కితే.. పోలీసులు ఎక్కడ అమ్మాయి ఆపదలో ఉందో గుర్తించి అక్కడికి చేరుకుంటారని ప్రచారం చేశారు.తర్వాత అభయం అనే మరో యాప్ను విడుదల చేశారు. ఆటోలు, ట్యాక్సీలలో ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం అభయం యాప్ను రూపొందించారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని.. ఆటోలో ప్రయాణించేటప్పుడు.. ఏదైనా సాయం అవసరం అయితే.. సులువుగా పోలీసుల్ని సంప్రదించవచ్చని ప్రచారం చేశారు. కానీ ఆ యాప్ వల్ల ఎంత మందిని రక్షించారో ఎవరికీ తెలియదు. వైసీపీ హయాంలో ఎంతో మంది మహిళలపై దాడులు.. దారుణాలు జరిగాయి. మీడిాయలో హైలెట్ అయితే.. మహిళా కమిషన్ తరపున వాసిరెడ్డి పద్మ పరుగున వెళ్లి పరామర్శించి నిందితుల్ని వదిలిపెట్టబోమని డైలాగ్ కొట్టి వస్తారు. ఆ తర్వాత నిందితుల్ని పట్టుకున్నారన్నసమాచారం కూడా ఉండదు. సంచలనం సృష్టించిన కేసులకూ అదే పరిస్థితి.
లేని దిశ చట్టాన్ని ఉన్నదని ఎందుకు భ్రమింప చేస్తున్నారు..?
పొరుగు రాష్ట్రంలో దిశ ఘటన జరిగిన తర్వాత… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష వేసే చట్టాన్ని తీసుకు వచ్చారు. దానికి దిశ అని పేరు పెట్టారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవేమీ ఏపీలో… అమ్మాయిపై దారుణాలు అడ్డుకట్ట వేయడానికి సరిపోవడం లేదు. దిశ చట్టం ఇంత వరకూ అమల్లోకి రాలేదు. కఠినమైన చట్టాలున్నా.. వాటిని అమలు చేయకపోవడం వల్లనే సమస్య వస్తోంది. దిశ చట్టం పేరుతో హడావుడి చేశారు కానీ.. చట్టం మాత్రం అమల్లోకి రాలేదు. ఇది… ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా.. చర్చకు వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. దిశ చట్టం అమల్లో ఉందనే భ్రమను కల్పించడానికి ప్రయత్నిస్తోంది. ఎంత దారుణంగా అంటే.. స్వయంగా హోంమంత్రి దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరేశామని ప్రకటించేంత… !