కొన్ని నిర్దిష్టమైన ఆలయాలలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న కట్టుబాట్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఇటీవలి విచారణ పర్వంలో అభ్యంతర కర వ్యాఖ్యలు చేయడం… అటు శని సింగనాపూర్లో గానీ, ఇటు శబరిమలైలోగానీ మహిళలను అనుమతించాల్సిందేనంటూ తీర్పులు చెప్పడం అనేది హిందూ మతపెద్దల్లో అసహనాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్టుతీర్పుపై హిందూ మతపెద్దలు, పీఠాధిపతులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో ప్రవేశం గురించిన విధినిషేధాలను మహిళలను అవమానిస్తున్నట్లుగా పరిగణించాల్సిన అవసరం లేదని, సనాతన సాంప్రదాయానికి గౌరవం ఇవ్వడం మాత్రమే అని అంటున్నారు.
హిందూ ఆలయాల్లో చాలా చోట్ల చాలా రకాల నిబంధనలు ఉంటాయి. కొన్ని చోట్ల పంచె లేకపోతే పురుషుల్ని కనీసం ఆలయంలోనికి కూడా రానివ్వరు. కొన్నిచోట్ల ఇతర మతాలకు చెందిన వారికి కనీసం ప్రవేశం ఉండదు. తిరుమల వంటి చోట్ల ఇతర మతాలకు చెందిన వారు, తాము వేంకటేశ్వరుని సేవను గుర్తిస్తున్నాం అని ఒక అఫిడవిట్ ఇస్తే తప్ప దర్శనానికి అనుమతి ఉండదు. సనాతనంగా ఉన్న ఆచారాలు, ఆయా క్షేత్రమహిమ, క్షేత్ర పురాణంతో ముడిపడిన అంశాల ఆధారంగానే.. అక్కడి నిబంధనలు తయారవుతుంటాయి.
శబరిమలైలో కూడా పిల్లలు, 50 ఏళ్లు దాటిన మహిళలకు అనుమతి ఉంటుంది. మహిళలు రుతుక్రమం, గర్భధారణ వంటి సమస్యలతో కూడా ఉంటుంటారు గనుకనే వారి విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, ఈ నిబంధనలు వారిని అవమానించడానికి అని అనుకోరాదని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. కోర్టులు మత విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఆయా మతపెద్దలతో చర్చించి, ఆచారాల గురించి కూడా తెలుసుకుంటే మంచిదంటూ విశాఖ శారదీ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అనడం విశేషం. ఇదివరకే ఈ విషయంలో పలువురు స్వామీజీలు తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా హిందూ మతపెద్దల వ్యతిరేకతలు ఇంకాస్త పెరుగుతున్నాయి. ఇది ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో గమనించాలి.