సాధారణంగా ఎవరైనా యువతి తనపై ఒకరు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే..పోలీసులు వేగంగా రియాక్టవుతారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారంటే ఇంకా సీరియస్‌గా తీసుకుంటారు. కానీ.. తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారు..? . ఎలా స్పందించాలో తెలియక తికమకపడతారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి పంజాగుట్టలో నివాసం ఉంటోంది. అనూహ్యంగా పోలీసుల ముందుకు ఈ ఫిర్యాదు చేసింది.
సాధారణంగా ఇలాంటి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు అమె మతి స్థిమితం మీద అనుమానపడతారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. చాలా వివరంగా.. తన ఫిర్యాదును పోలీసులకు ఇచ్చింది. దాదాపుగా వంద పేజీల ఫిర్యాదు పోలీసులకు ఇచ్చింది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. అమె ఫిర్యాదు చేసిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు.
యువతి కంప్లయింట్లో చెప్పిన వివరాల ప్రకారం..మి ర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009లో యువతికి వివాహం అయింది. కట్న వేధింపులు వేధింపులు తట్టుకోలేక 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది.రాజ్‌భవన్ రోడ్డులో నివాసం ఉంటూ చదువుకుంటూండగా..విద్యార్థి సంఘం నేతలు పరిచయమయ్యారు. అప్పటి నుంచి తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ సారి అబార్షన్ చేయించారని నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారని ఆమె చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.