బహుశః మరే ముఖ్యమంత్రికి ఎదురవని చేదు అనుభవాలు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరికే ఎదురవుతుంటాయేమో? డిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తమ ప్రభుత్వం అమలుచేసిన సరి-బేసి విధానం విజయవంతం అవడంతో నిన్న డిల్లీలో చత్రశాల స్టేడియంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. దానిలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా భావన అరోరా అనే ఒక యువతి, చేతిలో కొన్ని కాగితాలను చూపిస్తూ ముఖ్యమంత్రివైపు దూసుకు వచ్చి “సి.ఎన్.జి. కుంభకోణం గురించి మీ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?” అని ప్రశ్నిస్తూ చేతిలో ఉన్న కాగితాలను, దానితో బాటే తన వెంట తెచ్చుకొన్న ఇంకును ఆయనపైకి విసిరారు. కానీ ఆమె కొంచెం దూరం నుండి విసరడం వలన ఇంక్ అరవింద్ కేజ్రీవాల్, పక్కనే ఉన్న ఆయన మంత్రులపై కొద్దిగా పడింది. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ మధ్యలో తన ప్రసంగం ఆపి, ఆమెను విడిచిపెట్టి, ఆమె తనకు ఇవ్వదలచుకొన్న కాగితాలను తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆమె పంజాబ్ కి చెందిన ఆమాద్మీ సేనకి చెందిన నేత. సి.ఎన్.జి. కుంభకోణంపై తన వద్ద ఆధారాలున్నాయని, దానిపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
దేశంలో మిగిలిన ముఖ్యమంత్రులకు అరవింద్ కేజ్రీవాల్ పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రిననే బేషజం ప్రదర్శించకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలతో ఆయన స్పందించే తీరు కూడా చాలా సహజంగా, సాధారణంగా ఉంటుంది. బహుశః ఆ కారణంగానే అపుడపుడు సామాన్య ప్రజలు కూడా ఇటువంటి సాహసం చేస్తుంటారనుకోవాలేమో?
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా ‘కూల్’ గా స్పందించినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా, ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉండి ఉండవచ్చని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి, మంత్రులకు భద్రత కల్పించడంలో డిల్లీ పోలీసులు విఫలం చెందారని ఆరోపించారు. తమా ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి విధానం విఫలమవ్వాలని కొన్ని శక్తులు కోరుకొన్నాయని, కానీ సరి-బేసి విధానం విజయవంతం అవడంతో ఈవిధంగా తమపై అక్కసు తీర్చుకొనే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు. కానీ ఈ దాడికి పాల్పడిన భావన అరోరా తమ పార్టీకే చెందిన వ్యక్తి అనే సంగతి ఆయనకి అప్పటికి తెలిసినట్లు లేదు.