మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో ఆమోదించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియాకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల్లోనే అంటే… బుధవారం లోపే పార్లమెంట్ లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే… లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలన్నీ బిల్లులో ఉంటాయి.
అయితే ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే వెంటనే అమలు చేయడం కష్టమవుతుంది. అందుకే బిల్లులో ఎప్పట్నుంచి అమలు అనే కాలపరిమితి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడినందున… 2029 నుంచి పూర్తిగా అమలు చేసేలా బిల్లులో పెట్టవచ్చని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాకూ వచ్చిన సమస్యేమీ లేదని భావిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు ఎప్పుడో ఇచ్చారు. ఏపీ సహా 21 రాష్ట్రాల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అయితే ఇచ్చారు కానీ అత్యధిక చోట్ల మహిళలకు బదులు వారి భర్త లు లేదా పెత్తందారులే పెత్తనం చేస్తున్నారు. ఈ కారణంగా మహిళా నాయకత్వం అక్కడ్నుంచి ఎదగడం లేదు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల వల్ల కూడా అలాంటి పరిణామాలే వచ్చే చాన్స్ ఉంది. కానీ… అవకాశాలు కల్పించిన తర్వాత మహిళా నాయకత్వం బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.