ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమలకు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఎందుకంటే… విజయవాడలో అత్యాచార బాధితురాల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆమెను గౌరవించలేదట. అందుకే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ప్రతీ రోజూ బాధితులని పరామర్శించడానికే సమయం కేటాయించాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రమంతా తిరిగి మహిళా బాధితుల్ని ఓదార్చేపనిలో బిజీగా ఉంటారు వాసిరెడ్డి పద్మ.
విజయవాడ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన బయటపడిన రెండు రోజుల తర్వాత అదీ కూడా చంద్రబాబు పరామర్శిస్తున్నారని తెలిసిన తర్వాత హడావుడిగా ఆస్పత్రికి వెళ్లారు. చంద్రబాబు బాధితుల్ని పరామర్శిస్తున్న సమయంలో వాదనకు దిగారు. తర్వాత మీడియా ముందు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా అసహనంతో సమాధానాలు చెప్పారు. చివరికి చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించి వెళ్లారు . ఆఫీసుకు వెళ్లి చంద్రబాబు , బొండా ఉమకు విడివిడిగా నోటీసులుపంపారు. ఇంత వరకూ రాష్ట్రంలో చాలా ఘటనలు జరిగాయి. కానీ దేనిపైనా విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలని మహిళా కమిషన్ ఎవర్నీ ఆదేశించలేదు.
ఇప్పుడు ఏకంగా రాజకీయ కోణంలో … చంద్రబాబు , బొండా ఉమలను ఆదేశించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ను రాజకీయంగా వాడుకుని.. వ్యవస్థను బలహీనం చేస్తున్నారని అందుకే ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నా.. వెనక్కి తగ్గడం లేదు. తమ రాజకీయం తాము చేస్తున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.