‘ఆడ మగ ఇద్దరూ సమానమే
కానీ మగవాళ్లు ఇంకొంచెం ఎక్కువ సమానం’
– అంటూ కౌంటరేశారు బాపూ – రమణ. ‘రాధాగోపాళం’ సినిమాలో. మహిళలదెప్పుడూ రెండో స్థానమే.. అన్నది చాలా పాత మాట. ఇప్పుడు వాళ్లెంతో ముందున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ ఊద్యోగస్తులు అవుతున్నారు. అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారు. ఒక్క సినిమా రంగంలో తప్ప.
అవును…. చిత్రసీమలో వాళ్లెదెప్పుడూ అథమ స్థానమే. హీరోల చుట్టూ తిరిగే పరిశ్రమ ఇది. హీరోని బట్టే, హీరోల కోసమే కథలు పుడుతుంటాయి. వాళ్ల మార్కెట్నిచూసే పెట్టుబడి పెడతారు. వాళ్ల పోస్టర్ తోనే వ్యాపారాలు జరుగుతాయి. హీరోయిన్ అనే పాత్ర ఉన్నా – కేవలం హీరోని కవ్వించడానికీ, ప్రేక్షకుల్ని మరిపించడానికి తప్ప, ఆ పాత్రకో ప్రాధాన్యం ఉంటుందని, ఇవ్వాలని, స్త్రీ పాత్రని హీరోకి తగ్గ స్థాయిలో చూపించాలన్న ఆలోచన కూడా కనిపించదు. ప్రేమకథల్లోనో, సెంటిమెంట్ రంగరించిన చిత్రాల్లోనో వాళ్ల పాత్రలకు స్థానం ఉంటుంది తప్ప – కమర్షియల్ సినిమాల్లో స్త్రీ పాత్రల్ని ఎప్పుడో నిర్లక్ష్యం చేసేశాం. శ్రీలక్ష్మీ తరవాత ఆ స్థాయిలో హాస్య నటీమణులు మనకు దొరకలేదు. హేమ కొన్ని చిత్రాల్లో ఆ ప్రయత్నం చేసింది గానీ, పూర్తి స్థాయిలో రాణించలేదు.
ఇక 24 విభాగాల్లో వాళ్ల ప్రమేయం అంతంత మాత్రమే. ఎం.ఎం.శ్రీలేఖ తప్పితే.. సంగీత దర్శకురాలు కనిపించలేదు. కెమెరామెన్లు తప్ప కెమెరా ఉమెన్ అనే పేరు తెరపై ఎప్పుడూ చూసుకునే అవకాశం దక్కలేదు. గీత రచయితలుగా ఆడవాళ్లు మెరిసింది చాలా తక్కువ. శ్రేష్ఠ, చల్లా భాగ్యలక్ష్మి తప్ప ఈ రంగంలో కాలుమోపినవాళ్లు లేరు. కథా రచయితలుగానూ వాళ్లకు స్థానం దక్కలేదు. దర్శకత్వ విభాగంలో ఇప్పుడు నందినిరెడ్డి తప్ప – మరో పేరు వినిపించదు. వచ్చినా ఒక సినిమాకే పరిమితమైనవాళ్లున్నారు. జీవిత ఎప్పుడో దర్శకత్వం మానేశారు. ఇక ఎడిటింగ్ అంటారా..? సరే సరి.
ఒక్క కాస్ట్యూమ్స్లోనే వాళ్ల పేర్లు వినిపిస్తుంటాయి. ఎందుకంటే… సినిమాల్లో మహిళా పాత్రలు ఎక్కువగా ఉంటాయి… వాళ్లు అందంగా కనిపించాలంటే ఓ లేడీ డిజైనర్ ఉండితీరాల్సిందే కదా. అందుకు. నిర్మాణ రంగంలోనూ వాళ్లది హీన స్థానమే. అశ్వనీదత్ కుమార్తెలు, శ్యాం ప్రసాద్ రెడ్డి తనయ, మోహన్ బాబు గారాల పట్టీ.. ఇలా వాళ్లే ఉంటారు తప్ప… బయటి నుంచి వచ్చి, నిర్మాతగా స్థిరపడినవాళ్లు లేరు. డాన్స్ మాస్టర్లుతా తార పేరు ప్రబలంగా వినిపించేది. ఇప్పుడు అలా మెరుస్తున్నవాళ్లూ చాలా తక్కువగానే ఉన్నారు.
మొత్తానికి ఇలా ఏ రంగంలో చూసినా.. స్త్రీల వాటా చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఈ సంఖ్య పెరగాల్సిన అసవరం ఉంది. రచయితలుగా, కథకులుగా, దర్శకులుగా వాళ్లూ అడగు పెట్టాలి. తెలుగు సినిమా డైమెన్షన్ మారే అవకాశం ఉంటుంది.
(ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా)