తెలంగాణ రాజధానిలో పౌరసదుపాయాలు కల్పించే సంస్థ వారు ఘనంగా తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రమోషన్లలోనూ వింతలూ విడ్డూరాలూ జరుగుతున్నాయి. సీనియారిటీ ప్రకారం జరగాల్సిన బదిలీల్లో కొన్ని పేర్లు మాయం అవుతున్నాయి. మరణించిన ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. రిటైరైన మాజీ ఉద్యోగికి కూడా ఉదారం ప్రమోషన్ ఇచ్చేసి తమకు తామే సాటి అనిపించుకున్నారు. మూడేళ్ల క్రితం రిటైర్ కావాల్సిన ఉద్యోగిని ముందే ఇంటికి పంపేశారు.
గ్రేటర్ హైదరాబాద్ రవాణా విభాగంలో ఇటీవల ప్రమోషన్లు ఇచ్చారు. సాధారణంగా ఉద్యోగుల సర్వీసు ప్రకారం, సీనియారిటీ మేరకు ప్రమోషన్లు ఇస్తుంటారు. కానీ విచిత్రంగా ఈ లిస్టులో ఉన్న 19 మంది పేర్లు ప్రమోషన్ల జాబితాలో గల్లంతయ్యాయని యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి.
నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన ఓ ఉద్యోగికి ఉదారంగా ప్రమోషన్ ఇచ్చారు. అంతేనా, రెండేళ్ల క్రితం రిటైరైన వ్యక్తికీ పదోన్నతి కల్పించారు. ఇంతటిటో వీళ్ల లీలలు ఆగలేదు.
రిటైర్మెంట్ ఇవ్వడంలోనూ వింత పోకడలే. 2019లో రిటైర్ కావా్లసిన ఓ పారిశుధ్య కార్మికురాలిని ఇంటికి పంపేశారు. నువ్వు రిటైర్ అయిపోయావ్ అంటూ జీతం ఆపేశారు. ఇప్పుడామె లబోదిబో మంటోంది.
జి హెచ్ ఎం సిలో గందరగోళం నిర్ణయాలు, అక్రమాలపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. వీటిని వెంటనే సరిచేయక పోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి అధికారులు స్పందిస్తారో లేదో, కనీసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అయినా ప్రతిస్పందిస్తారో లేదో చూద్దాం.