స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చేసింది. ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా … రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల నియామవళి విషయంలో.. అందరికీ.. ప్రధానమైన రెండు సందేహాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఊరూవాడా… పూసేసిన రంగులు. రెండు ఇళ్ల స్థలాల పంపిణీ. దీనిపై..రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్నికల ప్రకటన చేసిన తర్వాతే..కోడ్ అమల్లోకి వస్తుందని… అప్పుడే తాము స్పందిస్తామని రంగుల విషయంపై… హైకోర్టులో విచారణ జరిగినప్పుడు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.
ఇప్పుడు.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం… పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు ఉండకూడదు. పోలింగ్ జరిగే స్కూళ్లలోనూ ఏ పార్టీ గుర్తులు ఉండకూడదు. ఇప్పుడు వాటన్నిటినీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో… ఉగాది రోజున ఇళ్ల స్థలాలనుపంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. కానీ అప్పటికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం.. ఉగాది రోజున ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. వీటిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించిన జర్నలిస్టులకు స్ట్రెయిట్ ఆన్సర్ వస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే ఏ స్కీమ్ అయినా కోడ్ కిందకే వస్తాయని .. పాత స్కీమ్ అయినా.. కొత్త స్కీమ్ అయినా ఎన్నికల కోడ్ అనుగుణంగానే ఉండాలని తేల్చేశారు. ఆ రంగులు… ఇళ్ల పట్టాల పంపిణీ.. ఓటర్లను ప్రభావితం చేస్తాయో లేదో మాత్రం చెప్పడం లేదు.
విశేషం ఏమిటంటే.. ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనుల్ని ప్రభుత్వం చేసేయడం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో సంబంధం లేకుండా పోలీసులతో కలిసి నిఘా యాప్ ప్రారంభించేసింది. దాని ద్వారా ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ పని చేయాల్సింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కదా అనే డౌట్ వచ్చిన వారికి సమాధానం దొరకదు.