చంద్రబాబునాయుడు గతసారి అధికారంలో వున్నప్పుడు ప్రపంచ బ్యాంకు షరతుల కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశా ఆయన ఓటమికి ముఖ్య కారణాల్లో అదొకటి. అయితే నూతన రాజదాని అమరావతిలోనూ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పాదం మోపుతున్నది. రాజధాని అభివృద్ధికి మొదటి దఫాగా 3200 కోట్ల రూపాయల రుణం ఇస్తానంటున్న బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రణాళికలపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి బ్యాంకు ప్రతినిధులు స్వయంగా వచ్చి పాల్గొంటున్నారు. ఇటీవలనే రాజదాని ప్రాంత అబివృద్ధి సంస్థ( సిఆర్డిఎ) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వర్క్‌షాపులు జరిపారు. డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణం, సామాజిక ప్రభావం, వరదల ముప్పు వంటి అంశాలను చర్చించారు. ల్యాండ్‌పూలింగ్ లేఔట్ల పనులు కూడా ప్రపంచ బ్యాంకు రుణంతో అమలు చేస్తామని ఆయన చెప్పారు. అందుకే ప్రత్యక్షంగా వారే వచ్చి చూసుకుంటున్నారన్నమాట. అయితే మా దగ్గర రాజధాని కోసం భూములు తీసుకుని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడతారా అని కొద్దిమంది రైతులు ప్రశ్నించారు కూడా. మూడేళ్లుగా పంటలు లేక వేయక చాలా నష్టపోయామని పరిహారం ఇచ్చేవారు లేరని రైతులు వాపోతున్నారు. మొత్తంపైన రాజధాని ప్రాంతంలో మాగాణి భాగంలో రైతులు నష్టపోతున్నామన్న భావనలో వుంటే మెట్టభాగం వారు రేట్లు పెరుగుతాయని బలపర్చారు. అయితే ఇప్పుడు మొత్తంగానే భూముల ధరలు తగ్గుముఖం పట్టడం, అడిగేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదంటున్నారు.