కరోనా దెబ్బకు దక్షిణాసియా మొత్తం పేదరికం నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలన్నీ వృథా అయిపోయి కథ మొదటికి వచ్చింది. ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు ఆగిపోయి, కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే.. ఇండియా మరో రకంగా ఇబ్బంది పడుతోంది. దక్షిణాసియాలో చిన్న దేశాల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ పెద్ద దేశమైన భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ప్రపంచబ్యాంక్ తేల్చేసింది. భారత వృద్ధి రేటు 2021 నాటికి కూడా 2.8 శాతం దాటడం కష్టమని ప్రపంచ బ్యాంక్ తేల్చేసింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వెంటనే వ్యవస్థను దారిలోకి తేవడం కుదరదు. తయారీ రంగానికి ఎగుమతుల ఊతం లభించాలి. దానికి తగ్గట్టుగా దేశీయ పెట్టుబడులు పెరగాలి.
విదేశీ ఇన్వెస్టర్లు దేశంపై మళ్లీ దృష్టి పెట్టాలి. ఫ్యాక్టరీలు నిరంతరాయంగా పనిచేయాలి. విమానాల రాకపోకలు మునుపటిలాగే సాగాలి. విదేశీయులు ఇండియాలో కాలు పెట్టాలి. పర్యాటక, హోటల్ రంగం గాడిలో పడాలి. జనం హాయిగా తిరుగుతూ రోడ్లన్నీ కళకళలాడాలి. ఇదంతా ఇప్పుడల్లా సాధ్యమయ్యే పరిస్థితిలా కనిపించడం లేదు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారికి తక్షణమే తాత్కాలిక ఉపాధి కల్పించాల్సి ఉంది. వినియోగం పెరగాలన్నా, ఫ్యాక్టరీలకు ముడి పదార్థాలు అందాలన్నా.. సరుకుల రవాణా నిరాటంకంగా సాగాలి. ప్రస్తుతం సరుకుల రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయింది. దేశంలో 50 లక్షల ట్రక్కులుంటే… ఇప్పుడు కేవలం నాలుగు లక్షలు మాత్రమే తిరుగుతున్నాయి.
నెలసరి వేతనం లేని ఉపాధి అవకాశాలు పొందుతున్న వారిని ఆదుకోవడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. లాక్ డౌన్ ప్రకటిస్తున్న తరుణంలోనే కేంద్రప్రభుత్వం రెండు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. 80 కోట్ల మంది పేదలకు నెలకు అదనంగా ఐదు కిలోల బియ్యం అందిస్తోంది. మూడు నెలల పాటు బియ్యం పథకం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. జన్ థన్ ఖాతాల్లో రూ. ఐదు వందలు జమ చేస్తోంది. అయినప్పటికీ లాక్ డౌన్ ఎక్కువ కాలం కొనసాగి… తయారీ రంగం పుంజుకోకపోతే మాత్రం వృద్ధి రేటు 1.5 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉందని ప్రపంప బ్యాంక్ విశ్లేషిస్తోంది. అదే జరిగితే… దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది.