ఇండియాలో ప్రపంచకప్ జరుగుతోంది. బోలెడన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా విశాఖకు కేటాయించలేదు. టీమిండియా ఆడే మ్యాచ్ లు కాకపోయినా కనీసం క్వాలిఫైయర్స్ తో ఇతర దేశాల జట్లు ఆడే మ్యాచ్‌లయినా కేటాయించలేదు. గతంలో దేశంలో ఏ మెగా టోర్నీ జరిగినా చివరికి ఆసియా కప్ జరిగినా విశాఖకు ఓ మ్యాచ్ కేటాయిస్తూ ఉంటారు. కానీ ఈ సారి ప్రపంచకప్ లాంటి టోర్నీ అయినా ఒక్క మ్యాచ్ కేటాయించలేదు.
హైదరాబాద్ కూ అన్యాయమే జరిగింది. హైదరాబాద్ కు మూడు మ్యాచ్‌లు కేటాయించారు. కానీ భారత్ లీగ్ మ్యాచ్ ఉన్నది ఒక్కటీ లేదు. మూడు మ్యాచ్‌లు కూడా క్వాలిఫైయర్స్ తో ఇతర జట్లు ఆడే మ్యాచ్‌లు. మిగతా కీలక మ్యాచ్‌లన్నీ ఇతర నగరాలకు కేటాయించారు. సహజంగానే అహ్మదాబాద్‌కు అత్యధిక ప్రాదాన్యం లభించింది. సాధారణంగా ఫైనల్ ఢిల్లీ లేదా ముంబైలో నిర్వహిస్తూ ఉంటారు. లేకపోతే బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి అంత స్థాయి ఉంది. విచిత్రంగా అహ్మదాబాద్ కు ఫైనల్ కేటాయించారు. అక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో ఇటీవల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వర్షం విధ్వంసం చూసిన వారు.. అక్కడ ఫైనలా అనుకోకుండా ఉంటారా ?
క్రికెట్లో ఓ రకమైన వ్యవస్థ వచ్చి.. చేరిన తర్వాత బీసీసీఐ పూర్తిగా అమిత్ షా కుమారుడు జే షా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లు గంగూలీని బీసీసీఐ చీఫ్ గా చేసి నడిపించారు. తర్వాత ఆయననూ తప్పించారు. ఇప్పుడు బీసీసీఐ చీఫ్ ఎవరో పెద్దగా ప్రచారంలోకి కూడా రారు. అంతే జేషా నడిపిస్తూ ఉంటారు. అందుకే అహ్మదాబాద్ కు ఎక్కడా లేనంత ప్రాధాన్యం లభిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో ?