ప్రేమలో ప్రేమ మాత్రమే ఉండదు. అన్నీ ఉంటాయి. స్వార్థంతో సహా. రొమాన్స్, పెయిన్.. ఇవి కూడా ప్రేమకు తోబుట్టువులే. ఇలాంటి ప్రేమకథనే చెప్పబోతున్నాడు విజయ్ దేవరకొండ. తను కథానాయకుడిగా నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. క్రాంతి మాధవ్ దర్శకుడు. రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈనెల 14న విడుదల కానుంది. కాసేపటి క్రితం ట్రైలర్ వచ్చింది.
టైటిల్‌ని బట్టే ఇది లవ్ స్టోరీ అని అర్థమైపోతోంది. 2 నిమిషాల 13 సెకన్ల ఈ ట్రైలర్లో ప్రేమే కనిపించింది. కాకపోతే వివిధ రూపాలలో. భార్యతో, ప్రేయసితో, బాస్‌తో.. ఇలా ప్రేమ రకరకాల రూపాలు మార్చుకుంది. అన్ని చోట్లా.. గౌతమ్‌నే ప్రేమికుడు. ఈ ప్రపంచంలో స్వార్థం లేనిది ప్రేమమాత్రమే, అయితే అందులోనూ నేను అనే రెండు అక్షరాలు ఓ సునామీనే సృష్టించగలవు అని నమ్మే ఓ ప్రేమికుడి కథ ఇది. తను ప్రేమకి ఇచ్చిన నిర్వచనం, తన జీవితంలో ఎదురైన అమ్మాయిలు, వాళ్లతో అనుభవాలూ.. వీటి సమ్మేళనంగా ఈ ప్రేమకథ సాగుతుంది. విజయ్ పాత్రలో చాలా కోణాలున్నాయి. కొన్నిచోట్ల పెళ్లి చూపులు లోని విజయ్ కనిపిస్తే, ఇంకొన్ని చోట్ల అర్జున్ రెడ్డిలోని విజయ్ కనిపిస్తున్నాయి. కథానాయికల పాత్రలూ కీలకమైనవే అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. లవ్ లో ఉండే ఎమోషన్, ఉండాల్సిన పెయిన్.. ఇవన్నీ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నాయి. ఈ ఫీలింగ్స్ అన్నీ వర్కవుట్ అయితే.. విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున.. ప్రేమ పక్షులకు ఇది మంచి ట్రీటే అనుకోవాలి.