కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో పాటు.. అనేక వేరియంట్లు ఇప్పుడు ప్రపంచ ప్రజల మీద దాడి చేస్తున్నాయి. దేశాలన్నీ లాక్ డౌన్లు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపే పరిస్థితి మళ్లీ వచ్చింది. అయితే అనూహ్యంగా చైనా నుంచి మాత్రం.. ఆ దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతోందని కొత్త కొత్త కథనాలు వస్తున్నాయి. అక్కడ కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఎవరూ చెప్పడం లేదు. ఆర్థిక వృద్ది గురించి మాత్రం బాకా ఊదేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం చైనాలో కరోనా ప్రభావం లేదని అనుకోవాలి. వైరస్‌ను పుట్టించి ప్రపంచం మీదకు వదిలేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాపై సెకండ్ వేవ్ ప్రభావం ఏమీ లేనట్లుగానే తెలుస్తోంది.
చైనాలో ఏం జరిగినా బయటకు రావాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతితోనే రావాల్సి ఉంటుంది. తమ దేశంలో జరిగే కరోనా మరణాల గురించి చైనా ఇప్పటికే సీక్రెసీ మెయిన్‌టెయిన్ చేస్తోంది. కరోనా కేసులు ఎన్ని వస్తున్నాయో చెప్పడం లేదు. కరోనా వెలుగు చూసిన మొదట్లో.. చైనా ఇలా నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి దిగజారిపోయింది.ప్రపంచం కష్టాల్లో పడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం చైనాలో ఎంత ఉందనేదాన్ని కూడా అంతే సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అదే సమయంలో తమపై ఏ ప్రభావమూ లేదన్నట్లుగా… అభివృద్ధి నివేదికలు వెల్లడిస్తున్నారు.
ఇటీవల కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చింది. వుహాన్ లేబరేటరీ నుంచి కరోనా వైరస్ లీకవలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. కానీ దీన్ని ఎవరూ నమ్మడం లేదు. ఖచ్చితంగా వైరస్ చైనాలోని వుహాన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభమై ఉంటుందని అంటున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ప్రపంచం మొత్తం ముప్పులో ఉంది.. కానీ అసలు సమస్య ప్రారంభానికి కారణం అయిన చైనా మాత్రం ప్రశాంతంగా ఉంది.