ఇంగ్లండ్ అనే ఒక మహాశక్తిని వణికిస్తున్న ప్రకంపనలు, యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మరోసారి బ్రిటిష్ ప్రభావం ప్రపంచాన్ని కమ్మేసే పరిస్థితి ఏర్పడింది. బ్రిటిష్ ప్రజల తీర్పు ప్రపంచ వ్యాప్తంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలన్న రెఫరెండం ఫలితం పెను ప్రభావం చూపుతోంది. భారత్ సహా అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు బేర్ మంటున్నాయి. రూపాయి విలువ అమాంతం పడిపోయింది. ముందుగా మొదలైన స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అమెరికా వాల్ స్ట్రీట్ పరిస్థితి కూడా అంతేనంటున్నారు పరిశీలకులు.
ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ అంతటా ఆందోళన, ఆనిశ్చితి. అన్ని ఖండాల్లోనూ అవే ప్రకంపనలు. బ్రిటిష్ పౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మన రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది
ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ లో తీర్పు ప్రభావం రవి అస్తమించని స్థాయిలోనే ఉంది. తూర్పు వైపు తెరుచుకున్న మార్కెట్లు కుప్పకూలిపోయాయి. బలమైన జపాన్ మార్కెట్లోనూ ఊగిసలాట తప్పలేదు. హాంకాంగ్ మార్కెట్ దీ అదే పరిస్థితి. భారత స్టాక్ మార్కెట్లయితే బేర్ మంటున్నాయి. సెన్సెక్స్ అమాంతం వెయ్యి పాయింట్లు పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి ఒక్కసారిగా 68 పైసలు నష్టపోయింది. అమెరికా ఖండాలపైనా ప్రభావం తప్పదంటున్నారు.
ఇంగ్లండ్ బయటకు వెళ్తే ఐరోపా యూనియన్ లో ఆర్థిక మాంద్యం అనివార్యమనే అంచనాలు భయపెడుతున్నాయి. ప్రపంచంలో ప్రబలమైన దేశంగా ఇంగ్లండ్ కు ఉన్న గుర్తింపు ఏమవుతుందో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాపైనా ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. వాల్ స్ట్రీట్ పై దీని ప్రభావం గణనీయంగానే ఉండొచ్చు. అంటే, వందల ఏళ్ల నాడు ఇంగ్లండ్ పాలన ప్రభావం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు ఒక్క నిర్ణయం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొన్ని దశాబ్దాల తర్వాత, ఇంగ్లండ్ ఎఫెక్ట్ ఏమిటో లోకానికి తెలిసివచ్చింది. కాకపోతే నెగెటివ్ కోణంలో. దీని ప్రభావం నుంచి ఇంగ్లండ్, ప్రపంచం ఎలా బయటపడతాయనేది కాలమే నిర్ణయించాలి.