ఇంకొన్ని గంటల్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది. అందుకే… ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ ఎలా చూపించాడో? త్రివిక్రమ్ పంచ్ లు ఎన్టీఆర్ ఎలా పలికాడో?? అంటూ అభిమానులంతా ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతటా పాజిటీవ్ బజ్ నడుస్తుంది. బిజినెస్ కూడా ఓ రేంజులో జరిగింది. ఓపినింగ్స్ అదిరిపోవడం ఖాయం. దసరా సీజన్ కాబట్టి ‘అరవింద..’కు మరింత కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ కోణాలే. అంతమాత్రాన నెగిటివ్ కోణాలు లేవని కాదు. ‘అరవింద..’పైనా కొన్ని భయలున్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చితే సరే సరే… అటూ ఇటూ అయితే? కొందరిలో సినిమాపై కొన్ని భయాలు వున్నాయి. ‘అరవింద..’పై వున్న ఆ అనుమానాలేంటి? వాటి ప్రభావం సినిమాపై ఎంత వరకూ ఉండొచ్చు.
* పూజా హెగ్డే
‘అరవింద..’లో కథానాయికగా పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. తొలిసారి తన పాత్రకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పుకుంది. పూజా గ్లామర్‌కు తిరుగులేదు. ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ బాగా పండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. కానీ అసలు భయం ఏమిటంటే… పూజాకు సరైన హిట్స్ లేవు. మొహంజదారో, ముకుందా, ఒకలైలా కోసం, డీజే, సాక్ష్యం.. ఇలా వరుస ఫ్లాపులు ఆమె ఖాతాలో ఉన్నాయి. పూజా ఓ ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఎన్టీఆర్ అభిమానుల భయం కూడా అదే. దానికి తోడు… త్రివిక్రమ్ తన కథానాయికల్లోని గ్లామర్ కోణాన్ని బయటపెట్టాలని అస్సలు అనుకోడు. ఇలియానాలాంటి కథానాయికని సైతం `జల్సా`లో డీ గ్లామర్ గా చూపించాడు. ఇక్కడా అదే జరిగితే… పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే సెంటిమెంట్ తోడైతే – అనేదే అభిమానుల భయం.
* డాన్స్ బీట్లేవీ…?
ఎన్టీఆర్ అంటే డాన్స్. మెరుపులాంటి తన మూమెంట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే.. ‘అరవింద సమేత’లో డాన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చే పాటల్లేవు. ఉన్న ఒక్క పాటా… అభిమానులకు అంతగా నచ్చలేదు. ఆరు పాటలంటే ఆరు పాటల్లోనూ తన డాన్సులతో రెచ్చిపోయే ఎన్టీఆర్… ఈ ఒక్క పాటతో అభిమానుల్ని ఏ మేరకు సంతృప్తి పరచగలడు అనేది సందేహం. పెనిమిటీ పాటకు మంచి ఆదరణ లభించింది. కానీ ఆ పాటలో ఎన్టీఆర్ డాన్సులు చేస్తూ బాగా నిరుత్సాహపరిచేశాడు. ఆ పాట థియేటర్లో ఎంత క్లిక్ అవుతుంది? అనేదాన్ని బట్టే ఈ సినిమాలో ఎమోషన్ పండుతుంది. మరి పెనిమిటీ ఏం చేస్తుందో చూడాలి.
* ఆరు ఆటలు
ఏపీలో ప్రభుత్వం ఆరు ఆటలకు ఛాన్స్ ఇచ్చింది. ఇది ఓ విధంగా మంచిదే. తక్కువ రోజుల్లో ఎక్కువ వసూళ్లు అందుకునే వీలు దక్కుతుంది.
దసరా సీజన్ కాబట్టి – అది మరింత కలిసొస్తుంది. అయితే ఇదంతా సినిమా బాగుంటేనే. విడుదల రోజు ఉదయం ఆరు గంటల ఆటకే ఫలితం తెలిసిపోతుంది. బాగుంటే… క్రౌడ్‌ని ఆపడం కష్టం. అటూ ఇటూ అయితే? నెగిటివ్ టాక్ బయటకు వస్తే… మార్నింగ్ షోల నుంచి జనం పలుచనబడిపోతారు. ఆ ఎఫెక్ట్ మిగిలిన షోలపై పడుతుంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాకి ఇదే జరిగింది. దానికీ ప్రభుత్వం ఆరు ఆటలకు అనుమతి ఇచ్చింది. కానీ రోజువారీ ఆటలకే జనం నిండలేదు. అదనపు ఆటల పరిస్థితి ఇక చెప్పక్కర్లెద్దు. ఈ యాంటీ సెంటిమెంట్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని భయపెట్టేదే.
* పంచ్‌లు లేవట
త్రివిక్రమ్ సినిమా అంటేనే పంచ్‌లు, ప్రాసలు. కామెడీతో సినిమాల్ని నిలబెట్టిన ఘనత త్రివిక్రమ్‌ది. అయితే తనని తాను మార్చుకునే ఉద్దేశంతో వాటి జోలికి వెళ్లలేదు త్రివిక్రమ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ఫన్ ఉంటుంది గానీ… ఫన్ కోసమే సీన్లు తీయలేదని, తొలి సగంలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కూడా తక్కువే ఉంటాయని త్రివిక్రమ్ తేల్చేశాడు. దాంతో… ఫన్ మిస్సయ్యిందా? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. సెకండాఫ్ మొత్తం యాక్షనే ఉంటుందని, అక్కడా వినోదం పండలేదని సమాచారం అందుతోంది. ఇంత హెవీ యాక్షన్ సీన్లు… అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. త్రివిక్రమ్ సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులు క్యూకడతారు. మరి ఇవన్నీ వాళ్లకు నచ్చుతాయా?? అనేది అనుమానం.
* రాయలసీమ మాండలికం
ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ ఫార్ములా జనం మర్చిపోయి చాలా కాలం అయ్యింది. అంత పాత ఫార్ములాని పట్టుకుని త్రివిక్రమ్ ఏం చెప్పి ఉంటాడు? అనేదే పెద్ద అనుమానం. రాయలసీమ మాండలికాన్ని వీలైనంత వాడుకోవాలని త్రివిక్రమ్ చూశాడు. నికార్సయిన రాయలసీమ భాష ఇందులో వినిపించబోతోంది. అయితే అది ఇప్పటి రాయలసీమ వాసులే ఆ భాష పలకడం లేదు. మరి మిగిలిన వాళ్లకు ఆ పదాలు, భాష, యాసలోని సొగసు ఏం అర్థమవుతుంది? మాండలికం మరీ ఎక్కువై… త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగులకు అడ్డు పడిందేమో అన్నది మరో పెద్ద అనుమానం.
ఇవన్నీ కేవలం భయాలు, అనుమానాలు మాత్రమే. ఒక్కసారి బొమ్మ పడ్డాక, ఎన్టీఆర్ విశ్వరూపం చూశాక అవన్నీ మర్చిపోవొచ్చు కూడా. ఈ భయాలే.. ప్లస్సులుగా మారే అవకాశం కూడా ఉంది. అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!