ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికలైనా… నిష్పక్షిపాతంగా జరగాలి. ప్రజలు తమ ఓటు తాము స్వేచ్చగా వేసుకునే వాతావరణం ఉండాలి.. ఇది ప్రజాస్వామ్య విధానాల్లో మౌలిక సూత్రం. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలైనా.. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే స్థానిక ఎన్నికలైనా… ఇది ముఖ్యం. అలా జరిగితేనే పారదర్శకంగా జరిగినట్లు. కానీ ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే… గెలిచిన వ్యక్తే ప్రజాప్రతినిధి. ప్రత్యర్థుల్ని బరిలో లేకుండా చేయడం ద్వాా ..ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేసి.. ఓటింగ్ వరకూ రాకుండా చేయడం ద్వారా.. విజయం సాధిస్తే.. అది కచ్చితంగా ప్రజాద్రోహమే అవుతుంది. అధికారం చేతిలో ఉందని.. తామే ప్రజలతో సంబంధం లేకుడా.. అన్నీ గెలవాలనుకోవడం నియంతృత్వం.
ఇప్పుడు.. ఏపీలో జరుగుతోంది అదే. ఎక్కడ చూసినా.. దాడులు..దౌర్జన్యాలే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకెత్తు కానీ.. వీటిని చూసిన తర్వాత ఓట్లు వేయడానికి వచ్చే వారు అసలు.. పోలింగ్ బూత్ల వరకూ వస్తారా… అనేది మరో కీలకమైన అంశం. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని కాపు కాసి.. వేటాడి..వెంటాడుతున్న అధికార పార్టీ నేతలు.. పోలింగ్ రోజు.. తమకు అనుకూలంగా ఓట్లు వేయరు అని భావించిన వారిని మాత్రం వదిలి పెడతారా.. అనే సందేహం ప్రజల్లో ప్రారంభమవుతోంది. ఖచ్చితంగా ఇదే వ్యూహంతోనే… అధికార పార్టీ.. ప్రణాళిక ప్రకారం.. అలజడి రేపుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పోటీ చేయకుండా నిలువరించడం.. లేకపోతే.. బెదిరించి అయినా నామినేషన్లు ఉపసంహరింపచేయడం … అదీ లేకపోతే.. దాడుల ద్వారా వ్యతిరేకంగా ఓట్లు వేయాలనుకున్న వారికి.. పోలింగ్ బూత్ వైపు రావద్దని సంకేతం పంపడం అనే వ్యూహాలతో ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం ఎందుకని.. నేరుగా నామినేట్ చేసుకోవచ్చని..ఇతర పార్టీల నేతలు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ప్రజాభిమానం పొందలేరని తేలిన తర్వాతే అధికారం అడ్డు పెట్టుకుని ఇలాంటి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికారపక్షానికే అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండానే .. ప్రజల ఓట్లతో గెలిచే అవకాశం అధికార పార్టీకి ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే పథకాలు ఆగిపోతాయనే భయమో.. తమ ప్రాంతంలో రోడ్లు లేదా..ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరనే ఆందోళనతోనే ప్రభుత్వానికే మద్దతిస్తారు. అందుకే.. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా.. ఇతర పార్టీలను పోటీల నుంచి నియంత్రించాలని ఇప్పటి వరకూ చూడలేదు. కానీ మొదటి సారి 50 శాతం ఓట్లకుపైగా సాధించిన అధికార పార్టీ.. ప్రజలు ఓట్లేయకుండానే గెలవాలనే తాపత్రయపడుతోంది. ప్రజాస్వామ్యంతో గెలిచి… అదే ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.