అవతలి పార్టీ కార్యకర్తలని చంపడం, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద రాళ్లు రువ్వడం, కింద పడేసి కొట్టడం, ఓటింగ్ యంత్రాలు పని చేయక మహిళలు ఎలక్షన్ కమిషన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, అర్ధరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరుపుతుండడం, ఎంపీ అభ్యర్థి ఓటర్ మీద పోలింగ్ బూత్ లోనే దుర్భాషలాడటం, మరొక పార్టీ కార్యకర్తలు, కొత్త పార్టీకి మద్దతిచ్చిన ఓటరు నీ తల పగిలేలా కొట్టడం ఇవి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపించిన దృశ్యాలు. గత 20 ఏళ్లలో జరిగిన అనేక ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలు అత్యంత దారుణమైన ఎన్నికల లా కనిపిస్తున్నాయని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు
శాంతి భద్రతలను కాపాడుతూ నే ఎన్నికలు నిర్వహించడం లో ఈ సారి ఎన్నికల కమిషన్ దారుణం గా విఫలమైందని సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి భారతదేశంలో ఎన్నికలు 80వ దశకం లో ఒక ప్రహసనంగా ఉండేవి. టిఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్ అయ్యేదాకా అసలు ఎన్నికల కమిషన్కు అన్ని అధికారాలు ఉంటాయని కూడా ప్రజలకు తెలియదు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఎన్నికలలో హింస తగ్గింది. బ్యాలెట్ బాక్సుల సమయంలో జరిగే రిగ్గింగ్ తగ్గిపోయింది. 2009 , 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ప్రశాంతంగా జరిగాయని చెప్పవచ్చు.
కానీ ఈసారి పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వైయస్సార్సీపి పార్టీకి మధ్య జరిగిన గొడవలు ప్రజలలో భీతిని అసహ్యాన్ని కలిగించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న వైఎస్ఆర్ సీపీ నేతల తపన కారణంగానే ఈ సారి హింస ఎక్కువగా నెలకొందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలోనే ఇంత హింస జరిగితే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన మధ్య తరగతిలో కనిపిస్తోంది.