సరిగ్గా ఐదేళ్ల క్రితం. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందన్నమాట. చిన్నికృష్ణ అనే రైటర్ (అప్పటికి ఆయన చేతిలో సినిమాలేం లేకపోయినా రైటరే అనాలి) మీడియా ముందుకు వచ్చారు. దాదాపు అరగంట సేపు అనర్గళంగా మాట్లాడాడు. ఆయన ప్రధాన ఎజెండా కేవలం జగన్ రెడ్డికి హైప్ ఇవ్వడం. ఒకర్ని పొగడాలంటే, ఇంకొకర్ని తిట్టాలి కదా? అందుకే చిరంజీవిని, పవన్ కల్యాణ్నీ కంబైండుగా తిట్టడం మొదలెట్టాడు. చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇస్తే, తనకు పది రూపాయల బాల్ పెన్ కూడా ఇవ్వలేదని, విస్తరాకేసి అన్నం పెట్టలేదని, దాదాపు ఏడ్చినంత పని చేశాడు. కాపు టికెట్లతో డబ్బులు సంపాదించిన (కాపు ఓట్లు ఉంటాయి.. కాపు టికెట్లు కూడా ఉంటాయా) చిరంజీవి, పవన్ కల్యాణ్ కాపులకు ఏం చేయలదేదని, వాళ్లని నమ్మకండని ఓటర్లని మొరపెట్టుకొన్నాడు. తన జీవితాన్ని మెగా ఫ్యామిలీ పాడు చేసిందని, వాళ్ల జాతకాలు త్వరలో బయటపెడతానని శపథం చేశాడు (ఎన్నికల తరవాత మళ్లీ ఆయన మీడియా ముందుకు రాలేదు. అది వేరే విషయం). చిరంజీవి సీట్లు అమ్ముకొన్నాడని, ఇండస్ట్రీకి ఏం చేయలేదని, కనీసం ఒక్క స్టూడియో కూడా కట్టలేదని.. చాలా చాలా చాలా అసందర్భ ప్రేలాపన పేలాడు. ఆఖరికి తానేదో రామానాయుడు వారసుడు అన్నట్టు… ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తున్నానని, ఎలక్షన్లు అయిపోయాక దాని గురించి ప్రకటిస్తానని, చిత్రసీమ ఉద్ధరణకు నడుం బిగించిన వాడిలా మాట్లాడాడు. కట్ చేస్తే.. ఏనాడూ, చిన్ని కృష్ణ కనిపించిన పాపన పోలేదు.
ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు చిన్నికృష్ణ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. చిరంజీవిని నానా మాటలు అనడం తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పని క్షమాపణలు చెప్పాడు, పద్మ విభూషణ్ అందుకొన్న చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలుసుకొన్నానని, తన యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారని, మంచి కథ ఉంటే తీసుకురమ్మన్నారని, వచ్చే జన్మలో చిరుకి తోబుట్టువుగా పుట్టాలని ఉందని.. జ్ఞానోదయం వచ్చినవాడిలా తన తప్పులన్నీ ఒప్పుకొని, మన్నించండి అంటూ రెండు చేతులూ జోడించారు.
ఐదేళ్లలో ఎంత మార్పు? అప్పటి చిన్నికృష్ణలోని ఆవేశం ఇప్పుడు ఏమైంది? ఐదేళ్ల క్రితం సరిగ్గా ఎన్నికల ముందు కేవలం కాపు ఓటర్లని జనసేనకు దూరం చేయాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి, అసలు విషయం ఏమీ లేకపోయినా, ఎన్నికలతోనూ, రాజకీయాలతోనూ తనకు సంబంధం లేకపోయినా, అప్పటి పరిణామలకు చిరంజీవితో ప్రమేయం ఉండకపోయినా, చిరుని కూడా టాపిక్లోకి లాగి, మెగా ఫ్యామిలీ మీద విషం కక్కి.. అంతా అయిపోయాక, ఇప్పుడు రెండు చేతులూ జోడిస్తే సరిపోతుందా? అప్పుడు ఎవరి ప్రలోభాలకు లొంగి, ఎవరి అండ దండలు చూసుకొని, కాపులకూ మెగా ఫ్యామిలీకి మధ్య చిచ్చు పెట్టాలనుకొన్నారు?
అంటే కాపు పేరు చెప్పి, పవన్ కల్యాణ్ ని తిడితే, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, తనకు తాయిలాలు ముడతాయన్న ఆశతోనే కదా ఇదంతా చేసింది. జగన్ గెలిచాడు. కానీ… ఆరోజు ఆయన వెన్నంటి నిలిచి, ఆయన మెప్పు కోసం తప్పులు చేసిన ఇలాంటి ఓ వర్గాన్ని జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి జగన్ ప్రభుత్వం రావడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు వీళ్లకూ జగన్తో కూడా పనిలేదు. అయితే గియితే మళ్లీ మెగా కాంపౌండ్ నే నమ్ముకోవాలి. అందుకే క్షమాపణలు చెప్పుకోవడాలూ, చేతులు జోడించుకోవడాలూ. అంతేనా? ‘అజాత శత్రువు’ అనిపించుకోవడం కోసం శత్రువుల్ని సైతం అక్కున కౌగిలించుకొనే గొప్ప గుణం చిరంజీవికి ఉందేమో? కానీ చరిత్ర ఇవేం మర్చిపోదు కదా? కాపులు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు కదా? ఎన్నికల ముందు జగన్ ఎన్ని డ్రామాలు ఆడగలడో, ఎవరిని ఎర వేసి, ఎవరిని లోబరచుకోగలడో నిరూపించడానికి ఈ ఉదంతం చాలు. ఏపీలో ఎన్నికలు మళ్లీ దగ్గర పడ్డాయి. గతంలోలా చిన్నికృష్ణ లాంటి ట్రంప్ కార్డుల్ని ఈసారీ వాడడానికి జగన్ ఏమాత్రం ఆలోచించడు. కానీ ఆలోచించాల్సిందల్లా కాపులే. వాళ్ల వేళ్లతో, వాళ్ల కంటినే పొడవడానికి జగన్ ఏం చేస్తున్నాడో గుర్తించాల్సిన తరుణం ఇది. మళ్లీ మోసపోతే అది జగన్ తప్పు ముమ్మాత్రం కాదని కూడా గుర్తించాలి.