అప్పుడెప్పుడో 1988 నుంచి తెలుగు ఇండస్ట్రీ లో రైటర్ గా ఉన్నాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. అయితే బాహుబలి రచయిత గా ఇప్పుడు భారతదేశమంతా సుప్రసిద్దుడయ్యాడు. ఇప్పుడు మెర్సల్ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలో భారీ హిట్ అందుకున్నాడు. దీనికి ముందు భజరంగీ భాయ్ జాన్ తో బాలీవుడ్ లోనూ ఒక ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఈ లెక్కన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇండస్ట్రీ హిట్లు కలిగిన రచయితగా ఇప్పుడు దేశమంతా ఈయన పేరు మార్మోగుతోంది.
అయితే 1988 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జున హీరోగా వచ్చిన జానకి రాముడు సినిమా తో వెలుగులోకి వచ్చాడు విజయేంద్ర ప్రసాద్. పునర్జన్మల నేపథ్యం లో వచ్చిన నాగేశ్వరరావు మూగ మనసులు సినిమానే కొంచెం మోడర్నైజ్ చేసి నాగార్జున కి జానకి రాముడు కథని అందించిన ఈ సినిమా బోల్తా పడినా, అదే పునర్జన్మల నేపథ్య కథ ని రెండు దశాబ్దాల తర్వాత మగధీర గా అందించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు విజయేంద్ర ప్రసాద్. మొదట్లో ఫక్తు ఫర్ములా కథలు వ్రాసి యావరేజ్ రచయిత గా ఉన్న విజయేంద్ర ప్రసాద్ సమర సింహా రెడ్డి తో ఒక్కసారి పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత తన కుమారుడు రాజమౌళి దర్శకుడవడం తో సింహాద్రి మొదలు బాహుబలి వరకు ఆయన చిత్రాలకి కథలందించి వెరీ సక్సెస్ ఫుల్ రచయిత గా మారాడు ఇండస్ట్రీలో.
అయితే నాణేనికి రెండోవైపు కూడా ఉంటుంది. బాల కృష్ణ విజయేంద్ర వర్మ, ఎన్ టీయార్ నా అల్లుడు, కన్నడలో ఇటీవల వచ్చిన జాగ్వర్ లాంటి ఆల్ టైం డిజాస్టర్లు కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి. ఇక ఆయన దర్శకత్వం లో వచ్చిన నాలుగు సినిమాలూ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. రాజన్న తప్ప మిగిలిన 3 సినిమాలు అయితే తలబొప్పి కట్టించాయి.
ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫ్లాప్ కావాలన్నా కథ ముఖ్యమే కానీ కథ ఒక్కటే సరిపోదు. దాన్ని సరిగ్గా తెరకెక్కించాలి. ఇంకా చాలా కుదరాలి. అలా అని చెప్పి కథా రచయిత పాత్రని తక్కువ చేయలేం. ఇదొక “ట్రిక్కీ” సిచ్యుయేషన్ రచయితలకి. అయితే ప్రస్తుతానికి మాత్రం కథ “అదిరింది” అని ప్రేక్షకులచేత అనిపించుకుంటూ సినీ రచనా రంగం లో ఛత్రపతిగా కొనసాగుతున్నాడు విజయేంద్ర ప్రసాద్!!!