మోహన్‌లాల్ ‘లూసిఫర్ 2- ఎంపురాన్’ చిత్రంపై వివాదం నెలకొంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో పలు సన్నివేశాల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదొక రాజకీయ ప్రాపగాండ సినిమా అని, ఓ మతాన్ని బ్యాడ్ లైట్ లో చూపించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది.
కాగా ఈ వివాదంలో లూసిఫర్ రచయితల్లో ఒకరైన మురళీ గోపీ స్పందించారు. ఈ వివాదంపై తానేమీ మాట్లాడాలనుకోవడం లేదన్నారు. ‘‘ఒక సినిమాని తమకు నచ్చినవిధంగా ఊహించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. వాళ్లకు నచ్చినవిధంగా ఊహించుకోనివ్వండి. నేను మాత్రం మౌనంగానే ఉంటాను’’అని చెప్పుకొచ్చారు.
లూసిఫర్ 2 సినిమా ఆరంభంలో ఓ మత ఘర్షణని చాలా తీవ్రంగా చిత్రీకరించాడు దర్శకుడు పృద్వీ రాజ్ సుకుమారన్. ఆ సన్నివేశాలు ఓ మతాన్ని చెడుగా చూపించాయని, దర్శకుడు పక్షపాత ధోరణితో చిత్రీకరించాడని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ వ్యక్తమౌతోంది. అయితే ఇప్పటివరకూ పృద్వీ రాజ్ సుకుమారన్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.