రచయితలపై కనక వర్షం కురుస్తున్న కాలమిది. రచయితలు మంచి పారితోషికాలతో గౌరవింపబడడం మంచి పరిణామమే. కొత్త రచయితలకు ఉత్సాహంగా ఉంటుంది. చేతిలో హిట్టున్న రైటర్లు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అన్నీ ప్యాకేజీగా ఇచ్చే రచయితలకు హిట్ పడితే, వాళ్ల పారితోషికం కోటికి తక్కువ కాదు. స్టార్ గీత రచయిత ఒక్కో పాటకూ 2 నుంచి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకొంటున్నారు. కథా రచయితకు అయితే… కోటి ఇస్తున్న రోజుల్లో ఉన్నాం. ఓ యువ రచయిత ఇప్పుడు రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. బహుశా.. రచయితల్లో అతనే హయ్యస్ట్ పెయిడ్ అనుకొవొచ్చు. తనే ప్రసన్న కుమార్ బెజవాడ.
జబర్దస్త్ స్కిట్లు రాసుకొంటూ, ఒక్కో మెట్టూ పైకెక్కి వచ్చిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ. నక్కిన త్రినాథరావుతో కలిసి కొన్ని మంచి హిట్టు ఇచ్చాడు. హలో గురూ ప్రేమ కోసమే, సినిమా చూపిస్త మావ వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలే. ఈ సినిమాలతో నక్కిన – ప్రసన్నలది హిట్ కాంబోగా మారిపోయారు. వీరిద్దరూ ఒక ప్యాకేజీగా పని చేస్తుంటారు. ధమాకాతో ఇద్దరి ఖాతాలో సూపర్ హిట్ పడింది. అప్పటి వరకూ కోటి, కోటిన్నర పలికిన ప్రసన్న కుమార్ ఇప్పుడు రూ.2.5 కోట్లు అందుకొంటున్నాడు. తన తాజా చిత్రం `మజాకా`కు రూ.2.5 కోట్లు ఇచ్చాడు నిర్మాత. ఓ రచయిత ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. దర్శకుడు నక్కిన పారితోషికం రూ.5 కోట్లు. ఈ సినిమా హిట్టయితే ఇద్దరూ తమ పారితోషికాన్ని మరింత పెంచే మూడ్ లో ఉన్నారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. రావు రమేష్ కీలక పాత్రధారి.