ప్రముఖ రచయిత్రి శోభా డే తన తెలివితేటలని తన రచనలలో చూపిస్తే అందరూ తప్పకుండా హర్షించేవారేమో కానీ రియో ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారుల పట్ల చాలా చులకనగా మెసేజ్ లు పెట్టడం ఎవరూ జీర్ణించుకోలేరు. కొన్ని రోజుల క్రితం ఆమె ఒక మెసేజ్ లో “మనవాళ్ళు రియో వెళతారు. సెల్ఫీలు తీసుకొంటారు. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒట్టి చేతులతో భారత్ తిరిగి వస్తారు. అసలు వాళ్ళని పంపడం డబ్బు వృధా విలువైన సమయం వృధా చేసుకోవడమే తప్ప మరొకటి కాదు,” అని విమర్శించారు.
భారతీయ క్రీడాకారులకి తగినంత శిక్షణ, సౌకర్యాలు, ప్రోత్సాహం, గుర్తింపు లేకపోయినా వారు తమకంటే అత్యుత్తమ స్థాయిలో శిక్షణ పొందిన వారితో రియో ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు. అందుకు సాక్షి మాలిక్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
తీవ్ర వ్యతిరేక పరిస్థితులని ఎదుర్కొని ఆమె భారత్ కి రజత పతకం సాధించింది. ఆమె తరువాత, సింధూ కూడా నిన్న సెమీ ఫైనల్స్ లో విజయం సాధించి భారత్ కి మరో పతకం ఖరారు చేసింది. వారిద్దరూ తమ ప్రతిభా పాటవాలని ప్రదర్శించుకొని భారత్ కి పతకాలు సాధించినందుకు యావత్ దేశ ప్రజలు ఆనందంతో పొంగిపోతుంటే, శోభా డే మళ్ళీ తన మేధోపరమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ “సిల్వర్ రాణి- సింధూ” అని మెసేజ్ పెట్టారు. అంటే సింధూకి బంగారు పతకం సాధించే శక్తి లేదు ఆమెకి వెండి పతకం సాధించడమే ఎక్కువ అన్నట్లు ఎగతాళి చేసినట్లు స్పష్టం అవుతోంది. శోభా డే తన జీవితంలో ఈవిధంగా భారత్ పేరు ప్రపంచదేశాలలో మారుమ్రోగేలాగ ఏమైనా చేశారో లేదో తెలియదు కానీ భారతదేశం గర్వపడే విధంగా మెడల్స్ సాధిస్తున్న లేదా సాధించడానికి చెమటోడ్చుతున్న మన క్రీడాకారుల పట్ల ఈవిధంగా అనుచితంగా మెసేజులు పెట్టడం ఎవరూ హర్షించలేరు. ఆమె చేస్తున్న ఈ అవహేళనకి ఇద్దరు మహిళలే ఆమెకి మెడల్స్ తో ధీటుగా సమాధానం చెప్పారు. కానీ ఆ సంగతి ఆమె గ్రహించినట్లు లేదని ఆమె తాజా ట్వీట్ తో స్పష్టం అవుతోంది.