టాలీవుడ్ లో రచయితలకు రాజభోగం నడుస్తుందని కొందరు, ‘అబ్బెబ్బే.. అసలు రైటర్ని పట్టించుకొనేవాడెవడూ..’ అని ఇంకొందరు. రెండూ కరెక్టే! ఎందుకంటే రచయితని రెండు రకాలుగానూ ట్రీట్ చేస్తుంటారు ఇక్కడ. కొంచెం ప్రతిభ, బోలెడన్ని తెలివి తేటలు, ఎక్కడ ఎలా మసలాలి? ఎక్కడ ఎలా ఉండాలి? అనే విషయాల్లో నైపుణ్యం ఉంటే చాలు. రచయితలు అందలం ఎక్కడం ఖాయం. ఇక్కడ ముఖ్యంగా లౌక్యం తెలిసుండాలి. అంతే. శ్రీకాంత్ విస్సాకి అలాంటి నైపుణ్యాలు చాలా ఉన్నాయనిపిస్తోంది. టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న రచయితల్లో ఆయన ఒకరు. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ఇలా స్క్రిప్టుకి కావల్సినవన్నీ సమకూరుస్తారు. పారితోషికం కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టు టాక్.
ఇక్కడ కొసరుగా కనిపించే ‘అసలు’ విశేషం ఏమిటంటే.. శ్రీకాంత్ విస్సాకి హిట్లు లేకపోవడం. ఆయన ‘పుష్ప’కి సంభాషణలు రాశారు. అయితే సింహభాగం క్రెడిట్ సుకుమార్‌కి వెళ్లిపోతుంది. ఆ తరవాత శ్రీకాంత్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్టు బాట పట్టలేదు. రవితేజతోనే ‘ఖిలాడీ’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఇలా సినిమాలు చేసుకొంటూనే వెళ్లారు. కానీ ఒక్కటంటే ఒక్క హిట్లు పడేలేదు. అయినా సరే.. రవితేజ శ్రీకాంత్ ని దర్శకుడిగానూ ప్రమోట్ చేయాలని చూస్తున్నట్టు టాక్. ఓ వేదికపై రవితేజ శ్రీకాంత్ ని తెగ మోసేశారు. ‘ఇలాంటి రచయిత దొరకడం నా అదృష్టం.. ఇంత కాలం ఏమైపోయాడో’ అంటూ మునగ చెట్టు ఎక్కించేశారు. దాంతో.. శ్రీకాంత్ విస్సాలో ఏదో విషయం ఉందని అంతా అనుకొన్నారు. ఓరకంగా శ్రీకాంత్ ని ప్రమోట్ చేసింది రవితేజనే.
శ్రీకాంత్ విస్సా.. తాజా చిత్రం ‘డెవిల్’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా ఆయనే సమకూర్చారు. పోనీ ఇదివరకేమైనా సూపర్ హిట్ చిత్రాలొచ్చాయా? అంటే అదీ లేదు. ‘భళా తందనాన’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ రెండూ ఫ్లాపులే. అయినా సరే.. శ్రీకాంత్ విస్సా టైమ్ నడుస్తోంది. సినిమా ఫ్లాప్ అయితే.. ఆ భారం హీరో మీదో, డైరెక్టర్ మీదనో పడిపోతోంది తప్ప, శ్రీకాంత్ ని తప్పు పట్టేవాళ్లెవరూ లేకపోవడం… శ్రీకాంత్ విస్సా కిస్మత్ అనుకోవాలి.