కర్నాటకలో రచయిత, హేతువాది ఎంఎం కాల్బుర్గి, హేతువాదులు నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్యలు, గొడ్డుమాంసం తిన్నారన్న ప్రచారంపై దాద్రిలో వృద్ధుడిని చంపడం…విడివిడిగా చూసినపుడు ఏవో ఉద్రేకాలో, ఉద్వేగాల వల్ల జరిగిన దారుణాలు అయివుంటాయని అనిపిస్తుంది. దేశం అవలంబిస్తున్న సాంస్కృతిక విలువలను మౌలికంగా మార్చాలన్న ప్రయత్నాలే ఈ సంఘటనల వెనుక ఒక అంతస్సూత్రంగా వుంది. మతవిద్వేషం రగులుకునే పరిస్ధితుల పట్ల ఆవేదనతో 25 మంది కవులు, రచయితలు తమకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సాహిత్య సంస్ధలు ఇచ్చిన అవార్డులను, నగదు బహుమతులను వాపసు ఇచ్చేశారు, ఇచ్చేస్తున్నారు.
ఇందరు కవులు, రచయితలు, ఆలోచనాపరులు, మేధావులు ఆవేదనతో నిరసన తెలుపుతున్న సందర్భం స్వాతంత్రభారత దేశంలో మరొకటి లేదు. నరేంద్రమోదీ ప్రధానిగా, బిజెపి ప్రధాన భాగస్వామిగా ఎన్ డి ఎ ప్రభుత్వం పాలన మొదలయ్యాకే సాంక్కృతిక దాడులు మొదలయ్యాయి. 88 ఏళ్ళ వయసులో కూడా రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న నయనతార సెహగాల్ సాహిత్య అకాడమీ తనకు ఇచ్చిన అవార్డుని తిరిగి అకాడమీకే పంపిచేశారు ”ఇప్పటివరకూ హత్యకు గురైనవారి స్మృతిలోనూ, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేసే హక్కుని కాపాడుకోవడం కోసం పోరాడినవారికీ, భయం గుప్పిట్లో బతుకుతున్న అటువంటి వారికి మద్దతుగా నేను నా సాహిత్య అకాడమీ అవార్డును వాపసు చేస్తున్నాను’’ అని ఆమె అకాడమీకి రాశారు.
ముస్లింలు, మైనారిటీలపై పదేపదే దాడులు జరగడాన్ని నిరసిస్తూ తన అవార్డును తిరిగి ఇచ్చేయాలని ప్రముఖ పంజాబు రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దాలిప్ కౌర్ తివానా మంగళవారం నిర్ణయించుకున్నారు. గౌతమ బుద్దుడు, గురునానక్ దేవ్ వంటి పుణ్యపురుషులు పుట్టిన ఈ దేశంలో ఇంకా సిక్కులపై అత్యాచారాలు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హింస కొనసాగడం హేయమని ఆమె తన లేఖలో ఆక్షేపించారు. ఇది మతోన్మాదం కాక మరేమిటని ప్రశ్నించారు. వాస్తవాలు, న్యాయం కోసం నిలబడే వారిని హత్య చేయడం ప్రపంచం దృష్టిలోనూ, దేవుని దృష్టిలోనూ మహా నేరమని ఆమె స్పష్టంచేశారు. మత విద్వేషాలు పెరిగిపోవడానికి నిరసనగా తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని మరో కన్నడ రచయిత ప్రొఫెసర్ రహమత్ తారికేరి ప్రకటించారు. రచయిత ఎంఎం కాల్బుర్గి హత్యను సాహిత్య అకాడమీ ఖండించకపోవడం విచారకరమని తారికేరి వ్యాఖ్యానించారు. లేఖతో పాటు అవార్డు కింద అందజేసిన లక్ష రూపాయల చెక్కు, శాలువా, జ్ఞాపికను రిజిష్టరు పోస్టులో బెంగళూరు అకాడమీ ప్రాంతీయ కార్యాలయానికి పంపినట్టు రచయిత పీటీఐకి తెలిపారు.
తనకు లభించిన సాహిత్య అవార్డులు, ప్రైజ్ మనీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచేస్తున్నట్టు ప్రముఖ మరాఠీ రచయిత ప్రదన్య పవార్ సోమవారం ప్రకటించారు. దేశంలో కొనసాగుతున్న మత విద్వేషాలకు నిరసనగా తన అవార్డులు వెనక్కి ఇస్తున్నట్టు ఆమె చెప్పారు. అవార్డులతో పాటు రూ.1.13 లక్షలు ప్రభుత్వానికి ఇచ్చేస్తానన్నారు. దాద్రి ఘటన, హేతువాదులు దభోల్కర్, పన్సారే, కాల్బుర్గిల హత్యలు పరమత ద్వేషం పెరిగిపోవడానికి ఉదాహరణలని పవార్ పేర్కొన్నారు. దేశంలో ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న ముస్లిం మైనారిటీ వ్యతిరేక వైఖరి, నియంతృత్వానికి నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని పవార్ చెప్పారు.
కృష్ణ సోబ్టీ, అరుణ్ జోషి నయనతార సెహగల్, అశోక్ వాజ్పేయి సహా మొత్తం 25 మంది రచయితలు తమ అవార్డులు, పదవులను వదులుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ ముందుగా తన అవార్డును వెనక్కి పంపి…ఇతర రచయితలు, కవులకు మార్గదర్శకంగా నిలిచారు. రచయితలు, హేతువాదులపై పదేపదే దాడులు కొనసాగుతున్నా సాహిత్య అకాడమీ ఎందుకు మౌనం వహిస్తున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అయిన సాహిత్య అకాడమీ తనకు తానుగా ఏమీ చేయలేదు. మతద్వేషం, ప్రశ్నించే వారిపై దాడులూ, ఆందొళనకరంగా పెరిగిపోతున్న ”కల్చరల్ పోలీసింగ్” పై రచయితల అవేదనకు, నిరసనకూ ఉన్నత స్ధాయి నుంచే స్పందన రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలి…దురదృష్టకరం…మాకు సంబంధంలేదు వంటి పొడిపొడి ఖండనలు కాకుండా ఆవేదనకు ఉపశమనం కలిగించాలి.