తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్లుగా ఇప్పటి వరకూ విపక్ష పార్టీలపైనే కేసులతో విరుచుకుపడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు.. సొంత పార్టీ వారినీ వదిలి పెట్టడం లేదు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల తర్వాత ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆ పార్టీ వర్గాల్లో కలకలానికి కారణం అవుతోంది. వైసీపీకే చెందిన ఓ రైతుపై .. ధాన్యం మద్దతు ధరపై ప్రశ్నించారన్న కారణంగా చెప్పుతో కొట్టబోయారు ఎమ్మెల్యే బొల్లా. ఆ రైతు వైసీపీ గ్రామస్థాయి నాయకుడు. ఎమ్మెల్యే ఇలా చేయబోయింది కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు సమక్షంలో. తాను కొట్టబోయిందే కాకుండా విషయం మీడియాలో వచ్చిందని పోలీసులకు చెప్పి రెండు రోజులు స్టేషన్లో పెట్టించారు.., ఆ తర్వాత పీఏతో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయించారు.
సొంత పార్టీ నేతను ఇలా చేస్తారా ఓ వైపు వైసీపీలో చర్చ జరుగుతూంటే… ఇలా చేయడం తప్పని ఎంపీ లావుకు అనిపించింది. దీంతో ఆయన పోలీసులకు ఫోన్ చేసి అక్కడేం జరిగిందో చెప్పారు. నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి.. రైతుపై తప్పుడు కేసు పెట్టారని.. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది . దీంతో ఎస్పీ రంగంలోకి దిగి ఆ కేసు గురించి వివరాలు ఆరా తీస్తున్నారు. అక్కడ హత్యాయత్నం లాంటిదేమీ జరగలేదని.. తప్పుడుకేసు లు పెట్టారని ఇప్పటికే పోలీసులకూ ఓ స్పష్టత ఉంది. దానికి సంబంధించిన ఆధారాలూ తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెప్పారని తప్పుడు కేసు పెట్టి రైతును జైలుకు పంపిన సీఐ, ఎస్ఐలపై వేటువేయడానికి రంగం సిద్ధమవుతోంది.
అయితే ఎమ్మెల్యే ఊరుకుంటారా? . ఎంపీ లావుపై ఆయన మండిపడుతున్నారు. ఎంపీ తనను బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారని… తన నియోజకవర్గంలోని అధికారులను బలిపశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ రచ్చ అంతకంతకూ పెరిగి పార్టీ అంతర్గత గొడవలకు దారి తీస్తూండటంతో వైసీపీలోనూ కలకలం ప్రారంభమయింది. ఇప్పటికే ఎంపీ లావుకు చిలుకలూరిపేట ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా వినుకొండలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.