జగన్ కార్యక్రమాలకి ఎవరు ప్లానింగ్ చేస్తున్నారో కానీ చాలా అనాలోచితంగా నిర్నయిస్తున్నట్లు కనబడుతోంది. ఆకారణంగా తరచూ ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ ఆగస్ట్ 28న వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. కానీ ఆరోజు వరలక్ష్మి వ్రతం పండుగ (శ్రావణ శుక్రవారం) కావడంతో వైకాపా తమ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని ఆగస్ట్ 29కి వాయిదా వేసుకోవలసి వచ్చింది. కానీ ఆరోజు రాఖీ పండుగ కావడంతో దుఖాణాలు, కార్యాలయాలు శలవు తీసుకొన్నాయి. ఆ కారణంగా ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నీ తెరిచి ఉంటే వాటిని బలవంతంగా మూయించి తమ బంద్ విజయవంతం అయిందని చెప్పుకోవడానికి వీలు ఉండేది. కానీ దుఖాణాలు, కార్యాలయాలు ముందే మూసి ఉండటంతో బంద్ జరిగిందో లేదో తెలియని పరిస్థితి. ప్రజలపై కూడా బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు.
మళ్ళీ సెప్టెంబర్ 22 నుండి జగన్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించేశారు. కానీ 17న వినాయక చవితి, 25న బక్రీద్ పండుగ ఉన్నట్లు గుర్తించి దీక్షను 26కి మార్చుకోవలసి వచ్చింది. ఇక తమ దీక్ష విజయవంతం అవ్వాలని ఎన్నడూ లేని విధంగా భూమిపూజ కూడా చేశారు. కానీ దీక్ష చేసేందుకు పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దానితో కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ భంగపడ్డారు. రేపు ఉదయం నుండి దీక్ష మొదలుపెట్టవలసి ఉండగా దానికి పోలీసులు, హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఇప్పుడు దానిని ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అసలు చేయాలా లేక మళ్ళీ వాయిదా వేసుకోవాలా? అని బుర్ర పట్టుకొని ఆలోచించుకోవలసి వస్తోంది. కానీ ఈ అనుభంతో పాఠం నేర్చుకొని మున్ముందు మళ్ళీ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది.