ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16న అంతర్రాష్ట్ర మండలి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇవ్వడానికి ఓ సర్వే చేయించారట. అందులో తెలంగాణ ముఖ్యమంత్రికి నెంబర్ వన్ ర్యాంకు వచ్చిందట. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదో ర్యాంకో లేక 13వ ర్యాంకో వచ్చిందట అనే ఊహాజనిత వార్త నాలుగైదు రోజులు చక్కర్లు కొట్టింది. తీరా చూస్తే అది గాలివార్తని తేలిపోయింది. ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించిన మోడీ, వారికి దిశానిర్దేశం చేయడం, వాళ్ల అభిప్రాయాలు వినడం తప్ప ర్యాంకులు గట్రా జోలికి పోలేదు.
పట్టుమని పది మంది చదువుతారో లేదో తెలియని ఓ తెలుగు దినపత్రిక మొదటి పేజీలో బ్యానర్ వార్తగా ఓ ఊహాజనిత కథనం ప్రచురితమైంది. కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని మోడీసర్వేలో తేలిందని, చంద్రబాబుకు ఐదో ర్యాంకు వచ్చిందని దాని సారాంశం. అంతే, ఇది చూసి ఇంకా అనేక ఇతర పత్రికలు, న్యూస్ చానళ్లు తామెక్కడ వెనకబడ్డామోనని తెగ కంగారు పడిపోయాయి. ఆ వార్తకు ఆధారం ఏమిటో తెలుసుకోకుండానే, మేము సైతం అని అబద్ధపు వార్తను ప్రచారం చేయడంలో పోటీ పడ్డాయి. ఒకటీ రెండు మినహాయిస్తే, మిగతా తెలుగు దినపత్రికలు, చానాళ్లు ఈ అసత్యాన్ని వ్యాపింప చేయడంలో తలో చెయ్యి వేశాయి.
మరీ ఆశ్చర్యం ఏమిటంటే, తొలికథనాన్ని ప్రచురించిన తెలుగు పత్రిక చంద్రబాబుకు ఐదో ర్యాంకు ఇచ్చింది. ఆ తర్వాత ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆయనకు 13వ ర్యాంకు ఇచ్చింది. ఆయన పనితీరు మోడీకి నచ్చలేదని, అందుకే అలా దిగజారిపోయారని ముక్తాయించింది. ఇది తెలిసి చంద్రబాబు తెగ ఇదైపోతున్నారని, మోడీపై మండిపడుతున్నారని అనేక పత్రికలు, చానళ్లు ఘోషించాయి. అదేదో చంద్రబాబు స్వయంగా వీళ్లకు చెప్పినట్టు, కళ్లు కట్టినట్టు కట్టుకథను ప్రచారం చేశాయి. ఇది చూసిన వారు, విన్న వారు నిజమే అనుకునేటంత నమ్మదగిన విధంగా అబద్ధాన్ని వ్యాపింపచేశాయి.
అంతర్ రాష్ట్ర మండలి ఉద్దేశాలు ఏమిటో కూడా తెలియదని తెలివితక్కువ జర్నలిస్టు ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఈ గాలివార్తను రాసి ఉండవచ్చు. యజమాని ప్రాంతం ఏదైనా ఆ పత్రిక ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది. హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న అనేక సంస్థల వారు కేసీఆర్ ప్రాపకం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశా అందులో భాగంగా ఆ ఊహాజనిత కథనం ప్రచురితమై ఉండొచ్చు. పక్క పత్రిక వారు, చానల్ వారు అబద్ధం రాసినా గుడ్డిగా ఫాలో అయిపోవడం తెలుగు మీడియాలో చాలా సంస్థలకు అలవాటు. ఈసారి కూడా అదే జరిగింది.
శనివారం రోజంతా ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఎవరికీ ర్యాంకులు ఇవ్వలేదు. అసలు ఎలా ఇస్తారు? ఈ అనుమానం కూడా జర్నలిస్టులకు, మీడియా సంస్థల వారికి రాకపోవడం విషాదకరం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయి. వనరులుంటాయి. అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఫలానా వ్యక్తి నెంబర్ వన్ సీఎం అని ప్రధాన మంత్రి ఎలా నిర్ణయిస్తారు? ఈపాటి ఇంగితం కూడా లేకుండా, చాలా మీడియా సంస్థలు నాలుగు రోజులు నానా హడావుడీ చేశాయి. మీడియా గాలివార్తలు రాయడం ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరి సారి కాదేమో.