పర్సనల్, పొలిటికల్ అజెండాలతో కొన్ని సినిమాలు తయారౌతుంటాయి. టార్గెట్ చేసిన టైంలో రిలీజైపొతేనే వాటికి ప్రయోజనం. అలా కాకుండా అన్ సీజన్ లో వస్తే దానిపై ఎవరీ ద్రుష్టి వుండదు. జబర్దస్త్ హాస్య నటుడు రాకింగ్ రాకేశ్ నటించి, స్వయంగా నిర్మించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా పరిర్థితి కూడా ఇలానే వుంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా ఇది. కేసీఆర్ పై ఇష్టంతో తాండా నుంచి హైదరబాద్ వచ్చిన ఓ యువకుడి కథ. బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడే ఈ సినిమాకి కొబ్బరికాయ్ కొట్టారు. అప్పటి బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు చాలామంది గులాబీ నేతలు ఈ సినిమా ఓపెనింగ్ లో సందడి చేశారు. నిజానికి ఎన్నికల ముందు రావాల్సిన సినిమా ఇది. కానీ అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయారు.
చిన్న బడ్జెట్ అయినప్పటికీ నిర్మాణంలో అనుభవ రాహిత్యం వలన రాకేశ్ నష్టపోయాడు. ఇదే టాపిక్ పై ప్రీరిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. రాకేశ్ కి వున్న పరిచయాలతో రోజాతో పాటు చాలా మంది నటీనటులు ఈ వేడుకకు వచ్చారు. అటు బిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమా అందరూ చూసి విజయం సాధించాలని కోరారు. అంతకుముందు స్వయంగా కేసీఆర్ ఈ సినిమాలో పాటని రిలీజ్ చేశారు.
అయితే ఎంతచేసినప్పటికీ ఈ సినిమా చుట్టూ ఏ మాత్రం హైపు లేదు. బిఆర్ఎస్ అధికారంలో వుంటే ఆ సినిమా చుట్టూ వుండే కలర్ వేరుగా వుండేది. కానీ సినిమా రాంగ్ టైంలో పడింది. ఈవారం నాలుగు మీడియం సినిమాలతో పాటుగా వస్తోంది. కనీసం కేసీఆర్ వీర ఫ్యాన్స్ అయినా ఈ సినిమా థియేటర్ లో అడుగుపెడతారో లేదో చూడాలి.