ఏనుగులను మ్రింగిన వాడిని పట్టుకొని అప్పుడెప్పుడో తిన్న అప్పడాలను కక్కమంటే ఎలా ఉంటుందో వందల కోట్ల 2జి స్కం చేసిన మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా పట్టుకొని రూ.27.9 కోట్లు పోగేసావని సీబీఐ ఆరోపించడం అలాగే ఉంది. అంతటి వాడిని పట్టుకొని జస్ట్ రూ.27.9 కోట్లు పోగేసాడని సీబీఐ ఆరోపిస్తే అది ఆతనూ చాలా అవమానంగానే భావించవచ్చును. ఆయన టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2జి కుంభకోణంలో వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇదే సీబీఐ ఇదివరకు ఆతని మీద కేసులు నమోదు చేసి సుమారు ఏడాదిపాటు తీహార్ జైల్లో చిప్పకూడు తినిపించింది. అతనితో పాటు డీ.ఎం.కె అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె కనిమోలిని కూడా అదే కేసులో అదే తీహార్ జైల్లో పెట్టి తన ప్రతాపం ఏమిటో చూపించుకొంది.
మరి ఆ కేసులు ఏమయ్యాయో అసలు ఉన్నాయో…అటకెక్కించేశారో తెలియదు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజులాగా బ్రతుకుతున్న ఆ రాజాపై అక్రమాస్తుల కేసు పెట్టారు. వందల కోట్లకి ఇంకా లెక్కలు తేలనే లేదు. కానీ అతను 1999-2010 సం.ల మధ్య రూ.27.9 కోట్లు వివిధ మార్గాల ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు అతనిపై కేసు నమోదు చేసారు. అతనితో బాటు అతని భార్య, సోదరులు, సన్నిహితులపై కూడా కేసులు నమోదు చేసారు.
అయితే ఈ రోజుల్లో సీబీఐ అధికారులు ఎవరయినా రాజకీయ నాయకుడిపై అకస్మాత్తుగా కేసులు పెట్టారంటే దాని వెనుక రాజకీయ కారణాలు ఏమయినా ఉన్నాయా? అని చూడక తప్పని పరిస్థితులు నెలకొనిఉన్నయిప్పుడు. ప్రధానమంత్రి అంతటివాడు రాష్ట్రానికి వస్తే సాధారణంగా ముఖ్యమంత్రులే పరుగులు తీసుకొంటూ వెళ్లి ఆయన్ని కలిసి వస్తుంటారు. కానీ కొన్ని రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తమిళనాడు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగోలేదని తెలిసి తనే స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు. అంతకు ముందు కర్ణాటక హైకోర్టు అక్రమాస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించగానే అందరి కంటే ముందుగా ఆమెకు ఫోన్ చేసి అభినందించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీయే. అది ఆమె మీద ఉన్న అభిమానంతోనో గౌరవంతోనో కాదు.
తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసుకోవాలంటే అందుకు ఆమె సహకారం, ఆమె పార్టీతో పొత్తులు చాలా అవసరం. అప్పుడే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పదోపదిహేనో సీట్లు ఆమె కేటాయిస్తారు. అధికార ఏ.ఐ.ఏ.డి.ఎం.కే. లేదా ప్రతిపక్ష డి.ఎం.కే. పార్టీలలో దేనిదో ఒకదాని ముద్రపడితే కానీ తమిళనాడులో ప్రజలు ఏ ఇతర పార్టీని కూడా పట్టించుకోరు. 130 సం.ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే అక్కడ దిక్కులేదు. అటువంటప్పుడు బీజేపీని పట్టించుకొంటారని భావించలేము. ప్రతిపక్ష డి.ఎం.కే. పార్టీ పరిస్థితిచూస్తుంటే అది ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధితో పాటే అంతమయిపోయేలా ఉంది. ఇక మిగిలింది ఏ.ఐ.ఏ.డి.ఎం.కే. అందుకే సింహంలాంటి మోడీ కూడా ఆమెను ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవాలని తిప్పలు పడుతున్నట్లు కనబడుతోంది.
తమిళనాడులో జయలలిత, కరుణానిధిల మధ్య రాజకీయ వైరం, వారి పంతాలు, ఒకరిని మరొకరు దెబ్బ తీసుకోవడానికి వేసుకొనే ఎత్తులు పైఎత్తులు గురించి అందరికీ తెలుసు. చచ్చిన పాములా ఉన్న డి.ఎం.కే. పార్టీకి కరుణానిధి కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమోలి మళ్ళీ ప్రాణం పోసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు, మొదట ఆ పార్టీకి చెందిన ఏ.రాజాని దెబ్బతీస్తే ఆ తరువాత మెల్లగా మళ్ళీ కనిమోలిని, ఆ తరువాత స్టాలిన్ పని పట్టవచ్చును.
ఆ ముచ్చట తీర్చితేనే తమిళనాడులో బీజేపీకి ఎంట్రీ పాస్ దొరుకుతుంది. బహుశః అందుకే మళ్ళీ సీబీఐ కొత్త కేసు భుజానికికెత్తుకొని ఉండవచ్చును. లేకుంటే 2జి కేసు నడుస్తున్న సమయంలోనే ఈ అక్రమాస్తుల కేసు పెట్టే అవకాశం ఉంది కదా?కానీ అప్పుడు పెట్టలేదు. కారణం కేసులు పెట్టడానికయినా ఒక సమయం, సందర్భం ఉంటుంది. మోడీ-జయలలితల సమావేశం జరిగిన తరువాతే సీబీఐ చిలకలు వచ్చి ఏ.రాజా ఇంటి మీద వాలి సందడి చేయడం మొదలుపెట్టాయి కనుకనే వారిద్దరినీ అనుమానించవలసి వస్తోంది. ఈ అనుమానాలు నిజమయితే తరువాత ఆ చిలకలు కనిమోలి ఇంటి మీద వాలినా ఆశ్చర్యం లేదు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సీబీఐ చిలకలని ప్రత్యర్ధులపై ప్రయోగించేది. వారిలో మోడీ కూడా ఉన్నారు. ఇప్పుడు మోడీ కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లున్నారు.