ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీపీఐ పిలుపు మేరకు ఈనెల 11న రాష్ట్ర బంద్ నిర్వహిస్తే దానికి కాంగ్రెస్, వైకాపా, వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. మళ్ళీ ఈనెల 29న వైకాపా కూడా ప్రత్యేక హోదా కోసమే రాష్ట్ర బంద్ నిర్వహించేందుకు సిద్దం అవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ దాని కోసం ఒక పార్టీ తరువాత మరొకటి ఈవిధంగా వరుసపెట్టి బందులు నిర్వహిస్తుంటే రాష్ట్రానికి నష్టం జరగదా? జరుగుతుందని తెలిసినా అవి ఈవిధంగా ఎందుకు బంద్ కి పిలుపునిస్తున్నాయి? అని ప్రశ్నించుకొంటే ప్రజలకి, ప్రభుత్వానికి తమ పార్టీల బలాన్ని ప్రదర్శించడానికే ఆవిధంగా చేస్తున్నాయని అనుమానించవలసి వస్తుంది.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని తెలిసి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఈవిధంగా జిల్లా, రాష్ట్ర బందులు చేయడం మంచి పద్ధతి కాదు. తెలంగాణా ఉద్యమాల కారణంగా అక్కడ పారిశ్రామిక అభివృద్ధి ఏవిధంగా కుంటుపడిందో దానిని మళ్ళీ ఇప్పుడు గాడిన పెట్టడానికి నాడు ఉద్యమాలు చేసిన కేసీఆరే స్వయంగా నేడు ఎంతగా కృషి చేయవలసి వస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటిస్తోంది. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదని అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు అడుగుపెట్టాలంటే మరెంత కష్టపడాలి? పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో చాలా అనువయిన వాతావరణం ఉందనే భావం కల్పించడానికి ప్రతిపక్ష పార్టీలతో సహా అందరూ కృషి చేయాల్సి ఉంటుంది. కానీ ఆవిధంగా చేయకపోగా ఏదో ఒక అంశం అందిపుచ్చుకొని నిత్యం ఉద్యమాలతో, బందుల రాష్ట్రాన్ని ఇంకా హోరేత్తిస్తుంటే రాష్ట్రానికి రావాలనుకొంటున్న పరిశ్రమలు, పెట్టుబడులు కూడా వెనక్కో, పొరుగు రాష్ట్రాలకో తరలివెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
కేంద్రం దిగివచ్చి మరో ఆర్నెల్లో, ఏడాది తరువాతనో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినా, రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్యమ వాతావరణం కారణంగా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అలాగని ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయకూడదని కాదు. చట్టసభలలో దాని గురించి గట్టిగా ప్రభుత్వాలను నిలదీయవచ్చును. అవసరమయితే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి చేయవచ్చును. అన్ని పార్టీల ప్రతినిధులు డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని నేరుగా హెచ్చరించి రావచ్చును. అవసరమయితే న్యాయ పోరాటాలు కూడా చేయవచ్చును. కానీ ఈవిధంగా తరచూ రాష్ట్ర బంద్ కి పిలుపునీయడం మాత్రం సమర్ధనీయం కాదు.
ఒకరోజు కొన్నివేల ఆర్టీసీ బస్సులు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడితే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో మోయదు. బందులకు పిలుపునిస్తున్న రాజకీయ పార్టీలు కూడా మోయబోవు. ఆ ఆర్ధిక భారాన్ని తిరిగి ప్రజలే ముఖ్యంగా సామాన్య ప్రజలే మోయవలసి ఉంటుంది. రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజార్చే ఇటువంటి బందులను ప్రజలు కూడా నిరసించాలి. అప్పుడే రాజకీయ పార్టీలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలలో పోరాడేందుకు ఆలోచిస్తాయి. లేకుంటే అవి ప్రజల భుజాల మీద ఈవిధంగా సవారీ చేస్తూనే ఉంటాయి.