క్రిందటి నెల 29వ తేదీన లిబియాలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకొన్న హైదరాబాద్ కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు-గోపీ కృష్ణ మరియు బలరాం ఇంత వరకు విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు చాలా ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితమే వారిద్దరినీ ఉగ్రవాదులు విడిచిపెడతారని సమాచారం వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా వారు విడుదల కాలేదు. కిడ్నాప్ అయిన వారిద్దరినీ వారు పనిచేస్తున్న సిర్తే విశ్వవిద్యాలయానికి సుమారు 300 కిమీ దూరంలో ఒక రహస్య ప్రాంతంలో ఉంచినట్లు సమాచారం. వారిని అక్కడి నుండి తిరిగి సిర్తే విశ్వవిద్యాలయానికి చేర్చాలంటే మధ్యలో అనేక ఇతర ముఠాల అధీనంలో ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులకు వారందరినీ అధిగమించి గోపీ కృష్ణ, బలరాంలను తిరిగి సిర్తే విశ్వవిద్యాలయానికి చేర్చడం పెద్ద విషయం కాకపోయినా వారు ఎందుకో ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు.
లిబియాలో ఉన్న భారత విదేశాంగ అధికారులు లిబియా ఉన్నతాధికారుల ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ అవింకా ఫలించ లేదు. కానీ తమ అధీనంలో ఉన్న తెలుగు వారిద్దరికీ ఎటువంటి ప్రాణహానీ తలపెట్టబోమని వారు ఖచ్చితమయిన హామీ మాత్రం ఇచ్చినట్లు సమాచారం. అదొక్కటే ప్రస్తుతం వారి కుటుంబాలకు కాసింత ఊరటనిస్తోంది. కానీ సున్నితమయిన ఈ వ్యవహారం గురించి తొందరపడి మాట్లాడటం చాల ప్రమాదకరమవుతుంది కనుక విదేశాంగ అధికారులు దీని గురించి మీడియాకు ఎటువంటి సమాచారం వెల్లడించడంలేదు. కానీ వారిద్దరినీ తప్పకుండా క్షేమంగా విడిపించుకోగలమని నమ్మకంగా చెపుతున్నారు.