ఓటుకి నోటు కేసు గురించి ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు అంత ఆసక్తి చూపించడం లేదు. కారణాలు అందరికీ తెలుసు. గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా తెలంగాణా ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ కేసును కనీసం ఇంటర్వెల్ వరకు కూడా తీసుకువెళ్ళలేక చేతులు ఎత్తేయడమే ఆ నిరాసక్తతకి కారణం. అయితే మధ్యలోనే ఎందుకు నిలిపి వేయవలసి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు అదృష్టమో లేక కేసీఆర్ తొందరపాటు వలననో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. లేకుంటే ఈ కేసు ఏవిధంగా ముందుకు సాగేదో, దానిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొనేదో ఎవరూ ఊహించలేరు.
ప్రస్తుతం ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు రెండూ నత్తనడకలు నడుస్తున్నాయి. బహుశః ఏదో ఒక రోజు ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఓటుకి నోటు కేసు ప్రదానోదేశ్యమయిన తెలంగాణాలో తెదేపాను దెబ్బ తీయడమనే ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతున్నట్లే ఉంది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ సింహా ఎసిబి అధికారులు విచారణ పేరిట తనను వేధిస్తున్నారని పిర్యాదు చేస్తూ మానవ హక్కుల సంఘంలో ఒక పిటిషను దాఖలు చేశారు. దానిపై స్పందించిన మానవ హక్కుల సంఘం ఆగస్ట్ 13లోగా ఈ కేసుపై పూర్తి నివేదిక ఇవ్వమని ఆదేశించింది.
ఉదయ్ సింహా ఎసిబి కోర్టులో కూడా మరొక పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుతో మరికొందరు తెదేపా నేతలకి కూడా సంబంధం ఉందని అంగీకరించమని ఎసిబి అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని, కొన్ని పత్రాల మీద తన చేత బలవంతంగా సాక్షి సంతకాలు చేయించేందుకు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని పిర్యాదు చేస్తూ ఒక పిటిషను వేశారు. ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించిన ఎసిబి కోర్టు ఈ కేసును ఆగస్ట్ 14కి వాయిదా వేసింది.