“రాజధాని ప్రాంతంలో రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించవద్దు, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళమని” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే హెచ్చరించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో నిర్వహించిన సీ.ఆర్.డి.ఏ.సమావేశంలో ఈనెల 20 నుంచి భూసేకరణ జరపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో భూసేకరణ, రాజధాని నిర్మాణ దశలు, దానికి అవసరమయిన నిధుల సమీకరణ, రైతులకు, రైతు కూలీలకు చెల్లింపులు మొదలయిన అనేక ముఖ్యమయిన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వర రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, సీ.ఆర్.డి.ఏ. కార్యదర్శి అజయ్ జైన్, కమీషనర్ శ్రీకాంత్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి ఈ నెల 20నుండి రైతుల భూమిని స్వాధీనం చేసుకోవాలనుకొంటోంది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానిపై ప్రతిస్పందించక తప్పదు. ఎందుకంటే ఆయనే స్వయంగా దీని ప్రసక్తి ఎత్తారు కనుక. ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన మౌనం వహిస్తే ఆయన చేస్తున్న ట్వీట్ మేసేజులకి అర్ధం ఉండదు. ఒకవేళ ఆయన మౌనం వహించినా ఇటువంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు భూసేకరణ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చును. ఇప్పటికే కొందరు రైతులు హైకోర్టునాశ్రయించి స్టే ఆర్డర్లు పొంది తమ భూముల్లో యదాప్రకారం పంటలు సాగు చేసుకొంటున్నారు. కనుక వారి నుండి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా హైకోర్టు అనుమతి పొందవలసి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టంలో చేసిన కొన్ని సవరణల వలన రైతుల నుండి భూమి స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. కానీ ఈ న్యాయ పోరాటాల వలన కొంత కాలయాపన మాత్రం తప్పకపోవచ్చును.