బీహార్ రాష్ట్రానికి మోడీ నిన్న ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి, దానితో బాటే మౌలికవసతుల అభివృద్దికి మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేయడం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి మంచి ఆయుధంగా అంది వచ్చింది. బీహార్ రాష్ట్రానికి ఇంతకు ముందు ఎప్పుడూ ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఇంత భారీగా నిధులు విడుదల చేయగలుగుతున్నప్పుడు, అన్ని విధాలా ఆదుకొంటామని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు.
రాష్ట్ర విభజన కారణంగా అన్ని విధాల చితికిపోయున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే బీహార్ పరిస్థితి చాలా మెరుగుగానే ఉందని భావించవచ్చును. అటువంటి బీహార్ కే అంత భారీ ప్యాకేజ్ ఇవ్వగాలగుతున్నప్పుడు ఆంద్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వరు? అని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ప్రశ్నించడం సహజమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీల అమలుగురించి రేపు చర్చించబోతున్నారు. బీహార్ రాష్ట్రానికి ఆయన ప్రకటించిన రూ.1.65 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజిని చూసి ఆంద్రప్రదేశ్ ప్రజల అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. అంతకంటే ఎక్కువ లేదా అంతే మొత్తం రాష్ట్రానికి మంజూరు చేయాలని ఆశిస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు కూడా బీహార్ ప్యాకేజీ గురించి ప్రస్తావించి, ఆంద్రప్రదేశ్ కి కూడా అంతకంటే ఎక్కువే మంజూరు చేయాలని కోరితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏమి సమాధానం చెపుతారో రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజి ప్రకటిస్తారో చూడాలి.