జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ పెన్నా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.7.85 కోట్లు విలువగల ఆస్తులను జప్తు చేసింది. అనంతపురం జిల్లాలో ఆ సంస్థకు చెందిన 230ఎకరాల భూమిని, హైదరాబాద్ లో (పయనీర్ హాలీడే రిసార్ట్స్) భవనాన్ని ఈడీ అధికారులు జప్తు చేసుకొంటున్నట్లు పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయంలో పెన్నా సిమెంట్స్ సంస్థకు ప్రభుత్వం లబ్ది కలిగించినందుకు ప్రతిగా ఆయన క్విడ్ ప్రో పద్దతిలో జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో రూ. 68 కోట్లు పెట్టుబడి పెట్టారని సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈ జప్తు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కానీ దీనిపై పెన్నా సంస్థ అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది కనుక దీనిపై అంతిమ నిర్ణయం వెలువడేవరకు ఈ ఆస్తులు ఈడీ ఆధీనంలోనే ఉంటాయి.