అధికారం శాశ్వతం అనుకునే వాళ్లకి ఎప్పటికప్పుడు కళ్లు తెరిపించే ఘటనలు ప్రపంచంలో ప్రతీ చోటా జరుగుతూనే ఉన్నాయి. నాటి హిట్లర్ నుంచి చెప్పుకుంటూ వస్తే.. మన కళ్ల ముందే చూసిన సద్దం హుస్సేన్, ముషారఫ్ లాంటి వాళ్లను దాటుకుని ఇప్పుడు ఆ జాబితాలో జిన్ పింగ్ కూడా చేరుతున్నారు. చైనాలో ఆయన రాజ్యంగ సవరణ కూడా చేసుకుని శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అక్కడ వ్యతిరేకించడానికి.. రూల్స్ చెప్పడానికి ఎన్నికల సంఘాల్లాంటివి కూడా లేవు. జిన్‌పింగ్ ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. కానీ అలాంటి జిన్ పింగ్ పరిస్థితి ఇప్పుడు తలకిందులయింది.
జిన్ పింగ్ తనకు ఎదురు లేదనుకుంటారు. అక్కడ వేరే పార్టీ ఉండదు. సొంత పార్టీలోనే ఎవరైనా ఎదురు తిరిగితే మరణశిక్షలు విధిస్తారు . తన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వేల కోట్ల సామ్రాజ్యాలనైనా కుప్పకూల్చేస్తారు. జాక్ మా ఉదంతమే మనకు తెలిసింది. తెలియనివి చాలా ఉంటాయి. అసలు ఎన్నికలే ఉండని ఆ దేశంలో జిన్ పింగ్‌కు ఎదురు ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడేమవుతుంది. అంచనా వేయడం కష్టం. చైనాలో పరిస్థితులు బయటకు తెలియడం లేదు కానీ.. ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం.
నియంతృత్వంలో ఉన్న వారి పరిస్థితే అలా ఉంటే.. ఇక ప్రజాస్వామ్యంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అధికారాన్నిప్రజలు ఎప్పుడైనా పీకేస్తారు. వాళ్లిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లనే బెదిరించి.. భయపెట్టి పాలన సాగించి మళ్లీ అదే పద్దతిలో ఓట్లు వేయించుకుంటామనుకుంటే అంతకంటే అమాయకులు ఉండదు. కానీ అధికారం నెత్తికెక్కిన వారు ఏదైనా సాధ్యమే అనుకుంటారు. అధికారం పోయిన తర్వాతే తత్వం బోధఫడుతుంది. కానీ ఆ తర్వాత అనుభవించాల్సినవి ఎక్కువ ఉంటాయి. అది తెలుసుకోని అప్రకటిత నియంతలకు ఎప్పటికైనా గడ్డుకాలమేనని జిన్ పింగ్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.